Special Parliament session: జూన్ 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ 3.0 మంత్రివర్గం కూర్పు కూడా పూర్తైంది. మొత్తం 71 మంది ఎంపీలకు మంత్రులుగా అవకాశం దక్కింది. వీరందరికీ శాఖలు కూడా కేటాయించడంతో మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్ ఎన్నిక, కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
8 రోజులపాటు ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జూన్ 24 నుంచి జులై 3 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. జూన్ 24, 25 తేదీల్లో కొత్త పార్లమెంట్ సభ్యులు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. కాగా, లోక్‌సభ స్పీకర్ పదవిపై ఎన్‌డీఏ కూటమి పార్టీలు టీడీపీ, జేడీయూ రెండూ ఆశలు పెట్టుకున్నాయి. 26న లోక్‌సభ స్పీకర్ పదవిపై సస్పెన్స్ తొలిగిపోనుంది.
ఇప్పటివరకు ఓం బిర్లా.. స్పీకర్ గా కొనసాగారు. ఆయననే మళ్లీ కొనసాగించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గంలో పని చేసిన పాతవారికే మళ్లీ అవే మంత్రిత్వ శాఖలు కేటాయించి ఏ విధంగా బీజేపీ వ్యవహరించిందో.. ఇప్పుడు అదే తరహాలో స్పీకర్ పదవికి సంబంధించి ఓం బిర్లానే పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోస్ట్ సీనియర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ను స్పీకర్ గా ఎన్నిక చేసే సంప్రదాయం కూడా ఉంది. అయితే, ఏపీ నుంచి పురంధేశ్వరి పేరు స్పీకర్ పదవి రేసులో వినిపిస్తోంది. పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అంతా ఆశించారు. కానీ, అనూహ్యంగా శ్రీనివాస వర్మకు ఏపీ బీజేపీ నుంచి పదవి ఇవ్వడం జరిగింది. దీంతో స్పీకర్ పదవి రేసులో పురంధేశ్వరి పేరు వినిపిస్తోంది.
స్పీకర్ ఎన్నిక తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. స్పెషల్ సెషన్ లో ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సెకండ్ సెషన్ లో వర్షాకాల సమావేశాల్లో బడ్జెట్ పై చర్చ, అలాగే ఆమోదానికి సంబంధించి సభ ప్రొసీడింగ్స్ జరిగే ఛాన్స్ ఉంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com