Parliament Winter Session 2023: జూలై20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 11 వరకు వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. మొత్తం 27 రోజుల పాటు సాగనున్న ఈ సమావేశాలు.. పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై.. తర్వాత కొత్త భవంతిలోకి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విపక్షాలన్నీ ఏకం అవుతుండటంతో.. ఈ దఫా పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. యూనిఫాం సివిల్ కోడ్, ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని డిసైడ్ కావడంతో పార్లమెంట్ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
యూనిఫాం సివిల్ కోడ్ యూసీసీపై గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఇటీవలే యూసీసీపై ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపాయి. అయితే, యూసీసీని కొన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. మరికొన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. యూసీసీకి మద్దతిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. యూనిఫాం సివిల్ కోడ్ అనేది దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలని చెబుతుంది. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా వ్యక్తిగత అంశాలపై చట్టాలు అమలు చేయాలని సూచిస్తుంది. వివాహాల నుంచి విడాకుల వరకు.. భరణం నుంచి వారసత్వం వరకు వ్యక్తిగత చట్టాల స్థానంలో ఉమ్మడి పౌరస్మృతి ఏర్పాటు చేయాలని చెబుతుంది. ఈ పార్లమెంట్ సమావేశాలలో యూసీసీ బిల్లును తీసుకురావాలని మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది పార్లమెంట్ సభ్యుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీని స్థానంలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశ పరిశోధన సామర్థ్యాన్ని పెంపొందించడానికి.. ఈ ఫౌండేషన్ నిధుల ఏజెన్సీగా ఉండనుంది.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇవే చివరి వర్షాకాల సమావేశాలు. మోదీ నేతృత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే దిశగా ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఈ సమయంలో అధికార బీజేపీని వివిధ అంశాలలలో పార్లమెంట్ వేదికగా గట్టిగానే నిలదీసే సూచనలు కనిపిస్తున్నాయి. మణిపూర్ ఘర్షణలు వంటి అంశాలను ప్రస్తావించి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com