Parliament Winter session: డిసెంబర్ 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం డిసెంబర్ 4వతేదీన జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటు సమావేశాలకు ముందు డిసెంబరు 2వతేదీన ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4వతేదీన ప్రారంభమై డిసెంబర్ 22వతేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ఒక రోజు ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, డిసెంబర్ 3న ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కారణంగా ఈసారి ఈ సమావేశాన్ని ఒక రోజు ముందుకు జరిపారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంమీ మహువా మోయిత్రాపై క్యాష్ ఫర్ క్వరీ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదికను కూడా ఈ సెషన్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్యానెల్ సిఫార్సు చేసిన బహిష్కరణ అమలులోకి రాకముందే సభ నివేదికను ఆమోదించాల్సి ఉంటుంది.
డిసెంబర్ 4 వ తేదీ నుంచి సెలవులు మినహాయిస్తే అదే నెల 22 వరకు మొత్తం 15 రోజుల పాటు పార్లమెంటు ఉభయసభలు సమావేశం అవుతాయని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. అయితే ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పలు ముఖ్యమైన బిల్లులు లోక్‌సభ, రాజ్యసభల ముందుకు రావచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలైన ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కొత్త చట్టాలను తీసుకురానున్నట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఆ బిల్లులు పార్లమెంటు ముందుకు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత- 2023.. సీఆర్‌పీసీ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023.. ఇక ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లను తేనున్నట్లు ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో చెప్పారు. ఈ మూడు బిల్లులను ఇప్పటికే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. తదుపరి పరిశీలన కోసం వాటిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపించింది. ఈ 3 బిల్లులకు సంబంధించిన నివేదికలు ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందాయి. ఈ నేపథ్యంలోనే ఈ శీతాకాల సమావేశాల్లోనే భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎంపీలు ఎం చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com