Parliament Winter Session: నేటినుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు -ఢిల్లీ బ్లాస్ట్, ‘సర్’పై చర్చకు విపక్షం పట్టు

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. శీతాకాల సమావేశాలు కూడా హాట్‌హాట్‌గా సాగేటట్టు కనిపిస్తున్నాయి. గత వర్షాకాల సమావేశాలు కూడా వాడివేడీగా జరిగాయి. బీహార్ ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ఓటర్ సర్వేపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఇప్పుడు బీహార్ ఫలితాల తర్వాత మరోసారి సమావేశాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో కూడా ఓటర్ సర్వే జరుగుతుంది. ఈ సర్వేను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మరోసారి పార్లమెంట్ దద్దరిల్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ఇటీవల ఢిల్లీ పేలుడు అంశంపై కూడా విపక్షాలు చర్చకు పట్టుపెట్టే ఛాన్సుంది.
ఇదిలా ఉంటే ఈ సెషన్స్‌లో 14 బిల్లులను ప్రవేశపెట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ముఖ్యమైంది అణుశక్తి బిల్లు.. అలాగే విద్యా కమిషన్ బిల్లు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, సెస్ విధించే బిల్లులు, అలాగే పాన్ మసాలా బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఈరోజు ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవనంలో ఉభయసభలకు చెందిన ప్రతిపక్షాల నేతలు సమావేశం కానున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో భేటీకానున్నారు. “ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ”, దేశంలో ఉగ్ర దాడులు, అంతర్గత భద్రత, దేశ రాజధానిలో ప్రాణాంతక వాయు కాలుష్యం, ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి అంశాలపై ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్సూహాలపై చర్చించి, కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ఇక పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

