Parliaments Winter Session: నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. నవంబర్ 25న మొదలై డిసెంబర్ 30 వరకు శీతాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలతేదీలు ఖరారయ్యాయి. నవంబర్ 25 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు మంగళవారం ప్రకటించారు. డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్ ఉభయసభలను సమావేశపరచాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నవంబర్ 26 నాటికి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆ రోజు పార్లమెంట్ ఉభయసభ ప్రత్యేక సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కిరణ్ రిజుజు తెలిపారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని ఆమోదించిన న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులు సమావేశం కానున్నారు. కాగా ఇదివరకూ నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించేవారు. కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని 2015 నుంచి నవంబర్ 26ను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లు మొదలైనవి సభ ముందుకు రాబోతున్నట్టు తెలిసింది. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదింపజేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. గురుగావ్ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. మరోవైపు విపక్షాలు జమిలి ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లు-2024ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో విపక్షాలు, అధికార ఎన్డీయే కూటమి సభ్యుల మధ్య పార్లమెంట్‌లో వాడి వేడి చర్చ సాగే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com