Train : రైల్లో భోజనం రేటుపై గొడవ.. రూ.20 కోసం ప్రయాణికుడిని కర్రలతో చితకబాదిన సిబ్బంది

ఉత్తరప్రదేశ్‌లో ఓ రైలులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.20 అదనంగా వసూలు చేయడాన్ని ప్రశ్నించినందుకు ఓ ప్రయాణికుడిపై క్యాటరింగ్ సిబ్బంది కర్రలు, బెల్టులతో దాడి చేశారు. ఈ అమానవీయ సంఘటన ఝాన్సీ సమీపంలో అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిహాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కత్రా నుంచి బినాకు అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన రైల్లో వెజ్ మీల్స్ ఆర్డర్ చేశారు. దాని ధర రూ.110 ఉండగా, క్యాటరింగ్ సిబ్బంది ఆయన వద్ద రూ.130 వసూలు చేశారు. దీనిపై నిహాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ధర ఎందుకు ఎక్కువగా తీసుకుంటున్నారని సిబ్బందిని ప్రశ్నించారు.
ఈ విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన క్యాటరింగ్ సిబ్బంది, నిహాల్‌పై దాడికి తెగబడ్డారు. కొందరు కర్రలు, మరికొందరు బెల్టులతో ఆయనను విచక్షణారహితంగా కొట్టారు. తోటి ప్రయాణికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు లెక్కచేయకుండా దాడిని కొనసాగించారు. ఈ దాడి దృశ్యాలను కొందరు ప్రయాణికులు తమ ఫోన్లలో చిత్రీకరించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే సిబ్బంది తీరుపై మండిపడుతూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రైళ్లలో ప్రయాణికుల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

