TTE dead : టికెట్ అడిగిన టీటీఈని కదులుతున్న రైలు నుంచి తోసేసిన ప్రయాణికుడు

కేరళలో కదులుతున్న రైలు నుంచి టీటీఈని ఓ టికెట్ లేని ప్రయాణికుడు తోసేయడం వల్ల ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. టీటీఈ అవతలి పట్టాలపై పడగా, అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయారు. ఎర్నాకుళం నుంచి పట్నా వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం రాత్రం ఈ ఘటన జరిగింది. బాధితుడిని ఎర్నాకులం నివాసి అయిన కె. వినోద్‌గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వినోద్ తన విధుల్లో భాగంగా నిందితుడిని టికెట్ అడగడం వల్ల అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. త్రిసూర్ మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలప్పయ్య ప్రాంతంలో రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. పాలక్కాడ్ వద్ద ఒడిశాకు చెందిన నిందితుడు రజనీకాంత్‌ను పట్టుకున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు.
ఎర్నాకులం-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్ 11 కోచ్‌లో ఉన్న నిందితుడిని టీటీఐ వినోద్ టికెట్ అడిగారు. టికెట్ లేదని అతడు చెప్పగా, అలా ప్రయాణించడం కుదరదని టీటీఐ చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా టీటీఈ వినోద్‌ను రజనీకాంత్ రైలు నుంచి తోసేశాడు. పట్టాలపై పడిన వినోద్‌కు తీవ్రగాయాలు కాగా, ఇంతలో అటు నుంచి వస్తున్న మరో రైలు ఢీకొనడం వల్ల టీటీఈ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. టీటీఈ వినోద్ ఎర్నాకుళంకు చెందినవారని, ఆయన కొన్ని సినిమాల్లో కూడా నటించారని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com