Patanjali Ayurved: సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన పతంజలి

Patanjali Ayurved: సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన పతంజలి
X
భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు జారీ చేయబోమని వివరణ

సుప్రీంకోర్టుకు పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ క్షమాపణలు తెలిపారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయుర్వేదం ద్వారా జీవనశైలి సంబంధిత వైద్య సమస్యలకు పరిష్కారాలను అందించడం, దీని వల్ల దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలపై భారాన్ని తగ్గించడమే పతంజలి తపన అని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు జారీ చేయబోమని ఆయన కోర్టుకు తెలిపారు.

యోగా గురు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణలను రెండు వారాల్లో వ్యక్తిగతంగా హాజరుకావాలని రెండు కిందట కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై పతంజలి కంపెనీ వేగంగా స్పందించింది. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టకూడదో తెలియజేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు ఇచ్చిన నోటీసుకు సమాధానంగా పతంజలి బేషరతుగా క్షమాపణలు చెప్పింది.

కాగా.. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు రాకుండా చూస్తామని ఆ సంస్థ తెలిపింది. వివరణ ద్వారా కాకుండా, ఆయుర్వేద పరిశోధనల మద్దతుతో పురాతన సాహిత్యం, సామగ్రిని ఉపయోగించి, జీవనశైలి వ్యాధులకు పతంజలి ఉత్పత్తులను వినియోగించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని దేశ పౌరులను ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని అఫిడవిట్ లో పేర్కొన్నారు.

వాస్తవానికి 2023 నవంబరులోనే వైద్య సమర్థత గురించి ఎలాంటి ప్రకటనలూ లేదా నిరాధారమైన వాదనలు చేయబోమని, వైద్య వ్యవస్థను విమర్శించబోమని కంపెనీ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. కానీ ఆ సంస్థ తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తూనే ఉంది. 2023 నవంబర్ తర్వాత విడుదల చేసిన ప్రకటనల్లో కేవలం సాధారణ ప్రకటనలు మాత్రమే ఉండేవని, కానీ పొరపాటున అభ్యంతరకరమైన వాక్యాలను చేర్చారని పతంజలి తన అఫిడవిట్లో పేర్కొంది.

Tags

Next Story