Rahul Gandhi : రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని తీర్మానాలు

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు రాహుల్ గాంధీనే చేపట్టాలని పలు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు దగ్గపడుతున్నా కొద్ది రాహుల్ గాంధీనే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీనే మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తీర్మానం చేశారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ కమిటీ కూడా రాహుల్ గాంధీనే అధ్యక్ష పదవిని చేపట్టాలని తీర్మానం చేసింది. రాహుల్ గాంధీ మరోసారి తన నిర్ణయాన్ని పునరాలోచించాలని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ రిక్వెస్ట్ చేశారు.
అయితే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబం నుంచే అధ్యక్షుడు వస్తాడనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారు. 2017లో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ.. 2019 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగారు. 2019లో మరోసారి కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ఇదిలా ఉంటే అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ 22న ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com