Amarnath Yatra: కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్‌నాథ్ యాత్ర

జమ్మూకశ్మీర్‌లో 36 రోజుల పాటు జరిగే పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మంచులింగాన్ని దర్శించుకునేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, భారత సైన్యం కల్పించిన సౌకర్యాలు, భద్రతపై యాత్రికులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గతంతో పోలిస్తే ఈ ఏడాది ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని భక్తులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా, భారత సైన్యం తమకు పూర్తి భద్రతా భరోసా కల్పిస్తోందని, వారి అండతోనే తాము నిర్భయంగా యాత్ర చేయగలుగుతున్నామని పలువురు యాత్రికులు తెలిపారు. ఒకప్పుడు ఉగ్రదాడుల భయంతో తక్కువ మంది వచ్చేవారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన భద్రతతో పెద్ద సంఖ్యలో యాత్రకు వస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు.
గురువారం ఉదయం బల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల తొలి బృందాలు బయలుదేరాయి. 5,246 మంది భక్తులతో కూడిన రెండో బృందం జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి ప్రత్యేక భద్రతా కాన్వాయ్‌ల నడుమ కశ్మీర్ లోయకు బయలుదేరింది. అంతకుముందు, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం యాత్రను అధికారికంగా ప్రారంభించారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి అధికారులు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా చర్యలు చేపట్టారు. భారత సైన్యం, పారామిలటరీ బలగాలతో పాటు అదనంగా 180 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) మోహరించారు.
యాత్రికులు తప్పనిసరిగా భద్రతా కాన్వాయ్‌లలోనే ప్రయాణించాలని, ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర గుహకు భక్తులు పహల్గామ్ లేదా బల్తాల్ మార్గాల గుండా చేరుకోవచ్చు. అయితే, ఈ ఏడాది భద్రతా కారణాల దృష్ట్యా హెలికాప్టర్ సేవలను నిలిపివేశారు. ఈ యాత్ర శ్రావణ పౌర్ణమి (రక్షా బంధన్) రోజైన ఆగస్టు 9న ముగియనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com