Supreme Court: విశ్రాంత హైకోర్టు జడ్జిలకు. పెన్షన్ రూ.15 వేలేనా..?

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల్లో కొందరికి నెలకు రూ.10,000-15,000 పింఛను ఇస్తుండటం పట్ల సుప్రీంకోర్టు బుధవారం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశంలో చట్టపరమైన వైఖరిని కాకుండా, మానవీయ దృక్పథాన్ని అనుసరించాలని ప్రభుత్వాన్ని కోరింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జిలకు వేర్వేరు పద్ధతుల్లో పింఛను ఇస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. జిల్లా న్యాయ వ్యవస్థ నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందినవారు నూతన పింఛను పథకం పరిధిలోకి వస్తున్నారు.
బార్ నుంచి హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి పొందినవారికి పాత పింఛను పథకం వర్తిస్తున్నది. ఫలితంగా హైకోర్టు జడ్జిగా పని చేసి, పదవీ విరమణ పొందిన వారికి పింఛను మొత్తం వేర్వేరుగా ఉంటున్నది. అటార్నీ జనరల్ ఆర్ వెంకట రమణి ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం వద్ద ప్రస్తావించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, తమ జోక్యం లేకుండా సమస్య పరిష్కారమయ్యేలా ప్రభుత్వానికి నచ్చజెప్పాలని కోరింది. తదుపరి విచారణ వచ్చే నెల 8న జరుగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com