PM Modi : స్వదేశీ ఉత్పత్తుల వాడకానికి పెద్దపీట వేయాలన్న ప్రధాని

ప్రపంచ ఆర్థిక రంగం అస్థిరతను, అనిశ్చితిని ఎదుర్కొంటున్న తరుణంలో మిగతా దేశాల మాదిరిగానే మనం కూడా సొంత ఆర్థిక ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, స్వదేశీ ఉత్పత్తుల వాడకానికి పెద్దపీట వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దేశ ప్రజలు స్వయంసమృద్ధి బాటలో నడవడం తప్పనిసరని అన్నారు.
దేశ స్వయంసమృద్ధి కోసం స్వదేశీ తయారీ ఉత్పత్తులనే విక్రయించాలని ప్రధాని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన్‌కీ బాత్ 126వ ఎపిసోడ్‌లో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ఆలిండియా రేడియోలో మాట్లాడారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రజలంతా ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి ధరించాలని కోరారు.
మహాత్మాగాంధీ.. స్వాతంత్ర్య పోరాట సమయంలో స్వదేశీ ఉత్పత్తులపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించారని ప్రధాని తెలిపారు. కాలక్రమంలో ఖాదీకి ప్రజాదరణ క్షీణించినప్పటికీ గత 11 ఏండ్లుగా మళ్లీ ఖాదీ ఉత్పత్తి పెరిగిందని చెప్పారు. రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కనబెట్టి దీనిపై దేశవ్యాప్త విప్లవానికి నడుం బిగించాలని, కేవలం భారతీయులు తయారుచేసిన వస్తువులనే కొనుగోలు చేయాలని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com