PM Modi : గ్రీస్ పర్యటనలో మోదీ

భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం గ్రీస్ దేశ పర్యటనకు వెళ్లారు. నలభై ఏళ్ల తర్వాత మొదటిసారి భారత ప్రధాని మోదీ ఏథెన్స్‌లో అడుగుపెట్టగానే గ్రీస్‌లోని భారతీయులు హోటల్ వెలుపల ఘనస్వాగతం పలికారు. గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ గ్రీస్ దేశంలో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన పట్ల గ్రీస్ దేశం ఏథెన్స్‌లోని భారతీయులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి మోదీ పర్యటనలో గ్రీస్‌లోని భారతీయ సంఘం సభ్యులు భారత్ మాతా కీ జై, వందేమాతరం, మోదీ జీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. బ్రిక్స్ సదస్సుకు హాజరైన ఆయన దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి గ్రీస్ దేశానికి బయలుదేరి వచ్చారు. గ్రీక్ ప్రధాని కైరియాకోస్ మిత్సోటాకిస్‌తో మోదీ సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేసే మార్గాలపై ఇద్దరు నేతలు చర్చిస్తారు. ఇరు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలతోనూ మోదీ సంభాషించనున్నారు. అతను గ్రీస్‌లోని భారతీయ సభ్యులతో కూడా భేటీ కానున్నారు. గ్రీస్‌లో ప్రధాని మోదీ కీలక చర్చల్లో పాల్గొంటారు. వాణిజ్యం, పెట్టుబడులు, షిప్పింగ్ వంటి విభిన్న అంశాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. విమానాశ్రయాలు, ఓడరేవులను ప్రైవేటీకరించడంలో భారతదేశ సహాయాన్ని పొందాలని గ్రీస్ భావిస్తోంది. దీంతో ఐరోపాలోకి ఇండియా అడుగుపెట్టేందుకు గ్రీస్ ఎంట్రీ పాయింట్‌గా ఉపయోగపడనుంది.
గ్రీస్‌లోని భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ ఈ పర్యటన చారిత్రక ప్రాముఖ్యతను వెల్లడించారు. ప్రధాని మోదీ, గ్రీస్ అగ్ర నాయకత్వం మధ్య జరగనున్న తదుపరి సమావేశాలను హైలైట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పీపుల్-టూ-పీపుల్ ఎంగేజ్‌మెంట్, సెక్యూరిటీపై ప్రధాన దృష్టి ఉంటుందని పేర్కొన్నారు. జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ కూటమి సమావేశాలకు హజరయిన మోదీ, గ్రీస్ కు, అక్కడి నుంచి శనివారం భారత్‌కు చేరుకోనున్నారు. అయితే, ఆయన తిరుగు ప్రయాణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మోదీ నేరుగా బెంగళూరు వెళ్లనున్నారు.
ఇస్రోకు చెందిన టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ఇస్ట్రాక్)ను సందర్శించనున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని భేటీ కానున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఈ భేటీ జరుగనుంది. అనంతరం ఉదయం 8.05 అక్కడి నుంచి బయలుదేరి 8.35 గంటలకు దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com