RAHUL: పారిశ్రామికవేత్తల నుంచి బీజేపీకి విరాళాలు

RAHUL: పారిశ్రామికవేత్తల నుంచి బీజేపీకి విరాళాలు
ఇది దేశ ప్రజలకు-25 మంది పారిశ్రామిక వేత్తలకు పోరాటం.... రైతుల గోడు పట్టించుకోవట్లేదన్న రాహుల్‌

భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల బాండ్ల ద్వారా పారిశ్రామికవేత్తల నుంచి పెద్దమొత్తంలో విరాళాలు స్వీకరించిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఎన్నికలు దేశంలోని పేద ప్రజలు, 25మంది బడా పారిశ్రామికవేత్తల మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. మద్దతు ధర కోసం రైతులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం యువత, పెరిగిన ధరల నుంచి కాపాడాలని మహిళలు కోరుతుంటే వారిమాట వినే నాథుడే లేరని రాహుల్ విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద సమస్యలైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని మీడియా పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఇరవైమందికిపైగా బడా పారిశ్రామికవేత్తలకు చెందిన 16లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయించిన ప్రధాని నరేంద్ర మోదీ..... రైతుల రుణాలు మాపీ చేయాలనే ఆలోచన మాత్రం చేయడంలేదన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేసిన రుణం ఉపాధి హామీ పథకంలో పనిచేసేవారికి.. 24ఏళ్లపాటు ఇచ్చే కూలీతో సమామని తెలిపారు. బడాబాబుల కొమ్ము కాస్తున్న వారిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


అమెథీ నుంచి కూడా బరిలో!

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన నామినేషన్‌ కూడా వేశారు. అయితే ఆయన ఉత్తరప్రదేశ్‌లోని తన పాత నియోజకవర్గం అమేథీ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వయనాడ్‌లో పోలింగ్‌ ముగిశాక అమేథీ నుంచి పోటీ చేయాలా వద్దా అనే దానిపై రాహుల్‌ నిర్ణయించుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌తో పాటు అమేథీ నుంచి కూడా రాహుల్‌ పోటీ చేశారు. అయితే వయనాడ్‌లో విజయం సాధించిన రాహుల్‌ గాంధీ అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఓడిపోయారు. ఈసారి రాహుల్‌ అమేథీ నుంచి పోటీ చేస్తారా అనే విషయంలో పార్టీ క్యాడర్‌తో పాటు అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర భారత దేశంలోనూ పార్టీకి ఊపు తీసుకురావాలంటే రాహుల్‌ అమేథీ నుంచి పోటీ చేయాలని పార్టీ శ్రేణులు గట్టిగా కోరుతున్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story