Narendra Modi : చైనా సరిహద్దుల్లో మోడీ

Narendra Modi : చైనా సరిహద్దుల్లో  మోడీ
సైనికులతో దీపావళి వేడుకలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సారి కూడా సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం ఉదయం చైనా సరిహద్దుకు అనుకుని ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లోని లెప్చా చేరుకున్నారు. అక్కడున్న దేశ భద్రతా బలగాలతో ప్రధాని దీపావళి వేడుకులు జరుపుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. ‘‘మన ధైర్యమైన భద్రతా దళాలతో దీపావళి జరుపుకోవడానికి హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చా చేరుకున్నాను.’’ అని ట్వీట్ చేశారు.

దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులతో దీపావళి జరుపుకోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కొత్తేం కాదు. 2014వ సంవత్సరంలో ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన ప్రతి సంవత్సరం సాయుధ దళాలతోనే దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. సైనికుల త్యాగాలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి మారుమూల ప్రాంతాలకు వెళ్లడం మోదీ ఒక పనిగా పెట్టుకున్నారు.


కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 2014వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళిని సియాచిన్‌లో భద్రతా బలగాలతో జరుపుకున్నారు. సియాచిన్ గ్లేసియర్ మంచుతో నిండిన పర్వతాలపై వీర జవాన్లు,సాయుధ దళాల అధికారులతో కలిసి మోదీ దీపావళి జరుపుకున్నారు. 1965 యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయాలను పురస్కరించుకుని 2015వ సంవత్సరంలో మోదీ పంజాబ్‌లోని మూడు స్మారక చిహ్నాలను సందర్శించారు.

2016వ సంవత్సరంలో చైనా సరిహద్దు దగ్గర సైనికులతో కలిసి దీపావళి జరుపుకునేందుకు మోదీ హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. మోదీ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, డోగ్రా స్కౌట్స్, సుమ్‌దోహ్‌లో ఆర్మీకి చెందిన వ్యక్తులతో ప్రధాని సంభాషించారు. చాంగో అనే గ్రామం వద్ద ఆగి స్థానికులతో మోదీ మాట్లాడారు.

2017వ సంవత్సరంలో ప్రధానమంత్రి ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌ను సందర్శించారు.. 2018వ సంవత్సరంలో మోదీ ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌లో దీపావళి పండుగ చేసుకున్నారు. 2019వ సంవత్సరంలో మోదీ జమ్మూ, కాశ్మీర్‌లోని రాజౌరిలో సైనిక సిబ్బందిని కలిశారు. 2020వ సంవత్సరంలో రాజస్థాన్‌లోని లాంగేవాలా సరిహద్దు పోస్ట్‌ను మోదీ సందర్శించారు. 2021వ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్‌లోని నౌషేరాలో మోదీ దీపాల పండుగను జరుపుకున్నారు. గతేడాది కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. మోదీ 1999వ సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ సిబ్బందికి నివాళులర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story