PM: భగ్గుమంటున్న ఉష్ణోగ్రతలపై మోదీ సమీక్ష

వేసవి నెలల్లో విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయన్న సూచనల నేపథ్యంలో సంసిద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా స్థాయి యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని ప్రధాని ఆదేశించారు. కేంద్ర ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, భారత వాతావరణ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సమావేశంలో అధికారులు ప్రధానికి వివరించారు. మధ్య పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతంలో ఎండ తీవ్రత తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. అవసరమైన మందులు, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్‌లు, ఓఆర్‌ఎస్, తాగునీరు లభ్యత, ఆరోగ్య రంగం సన్నద్ధతను సమీక్షించినట్లు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. అవసరమైన సమాచారం అందించి ప్రజలకు అవగాహన కల్పించడం సహా.. కార్చిచ్చు వంటి విపత్తుల నిర్వహణపై విస్తృతంగా చర్చ జరిగినట్లు పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ....
గడిచిన పదేళ్లలో లేనంతగా తెలంగాణ భగ్గుమంటోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే వడగాలులు తీవ్రస్థాయిలో వీస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వేడి ప్రారంభమై మధ్యాహ్నం 12 తర్వాత బయటకు రాలేనంత తీవ్రమవుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో ఆదివారం 9 జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ జిల్లాల్లోని 34 మండలాల్లో రికార్డుస్థాయిలో వడగాలులు నమోదయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గతేడాది ఉష్ణోగ్రతల కన్నా ప్రస్తుతం దాదాపు అన్ని జిల్లాల్లో 3.5 డిగ్రీలపైనే అధికంగా నమోదవుతున్నాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడంతోనే ప్రస్తుతం వాతావరణంలో వేడి అమాంతంగా పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెలలో మున్ముందు మరింత తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు వీస్తాయని, వృద్ధులు, బాలింతలు, పిల్లలతోపాటు పక్షులపైనా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఈ అధిక ఉష్ణోగ్రతలతో ఏర్పడే అల్పపీడనం కారణంగా.. సోమవారం నుంచి ఈ నెల 11 వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ఏడాది తీవ్రమైన వేడితో ఉమ్మడి నల్గొండ జిల్లా కుదేలవుతోంది. తెలంగాణలో మొదటిసారిగా మార్చి 30న వేములపల్లి, నిడమనూరు మండలాల్లో వడగాలులు వీచాయి. ఈ నెల 6న మునుగోడు, వేములపల్లి, వలిగొండ, బొమ్మలరామారం మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com