PM Modi: భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నం.. ప్రధాని మోడీ ఏమన్నారంటే …

PM Modi: భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నం.. ప్రధాని మోడీ ఏమన్నారంటే …
X
ఈ దాడి భారతీయులను ఆగ్రహానికి గురి చేసిందన్న ప్రధాని మోడీ

ప్రధాన న్యాయమూర్తిపై దాడి ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా ప్రధాని మోడీ స్పందించారు. బి.ఆర్. గవాయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆయనపై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందని మోడీ తెలిపారు. మన సమాజంలో ఇటువంటి చర్యలకు చోటు లేదు. ఇది చాలా సిగ్గుచేటని అన్నారు. ఈ మేరకు మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. “భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ జీతో మాట్లాడాను. ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయనపై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇటువంటి చర్యలకు చోటు లేదు. ఇది పూర్తిగా ఖండించదగినది. దాడి జరిగినప్పుడు జస్టిస్ గవాయ్ ప్రశాంతతను ప్రదర్శించినందుకు నేను అభినందించాను. ఇది న్యాయ విలువల పట్ల, మన రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడం పట్ల ఆయన నిబద్ధతను హైలైట్ చేస్తుంది.” అని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో అమానుష ఘటన చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌‌పై దాడి జరిగింది. బీఆర్.గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించాడు. గవాయ్‌పై షూ విసిరాడు. దీంతో కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. ‘‘సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే’ అని అరుస్తూ ఓ న్యాయవాది దాడికి పాల్పడ్డాడు. అయినా కూడా గవాయ్ ఏ మాత్రం ఆందోళన చెందలేదు. ఇలాంటి దాడులు తనను ఏ మాత్రం ప్రభావితం చేయవని వ్యాఖ్యానించి ప్రశాంతంగా ఉండిపోయారు. అనంతరం విచారణను యథావిధిగా కొనసాగించేశారు. బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం.. సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ముందు కేసుల విచారణ జరుగుతోంది. ఓ న్యాయవాది వేదిక దగ్గరకు వెళ్లి ప్రధాన న్యాయమూర్తిపైకి షూ విసిరేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి అడ్డుకున్నారు. అనంతరం న్యాయవాదిని కోర్టు వెలుపలకు లాక్కెళ్లిపోయారు. కోర్టు గది నుంచి బయటకు తీసుకెళ్తుండగా న్యాయవాది ‘‘సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే’’ (సనాతన్‌ను అవమానించడాన్ని మేము సహించం) అంటూ అరుస్తూ కనిపించాడు. నిందితుడు వృద్ధ న్యాయవాది అయిన కిషోర్ రాకేష్‌గా గుర్తించారు. ఇతనికి ప్రాక్సిమిటీ కార్డు ఉన్నట్లుగా తెలిసింది. అయితే.. బార్‌ అసోసియేషన్ అతడిపై చర్యలు తీసుకుంది. ప్రాక్టీస్ లైసెన్స్‌ను రద్దు చేసింది.

Tags

Next Story