Narendra Modi: బొగ్గు గని ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి...మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు పరిహారం

Narendra Modi: బొగ్గు గని ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి...మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు పరిహారం
X
మేఘాలయ బొగ్గు గనిలో పేలుడు, 16 మంది కార్మికులు మృతి

మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని ఓ బొగ్గు గనిలో గురువారం భారీ పేలుడు సంభవించడంతో 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఈ ఘటనపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. "ఈస్ట్ జైంతియా హిల్స్‌లో జరిగిన ప్రమాదం నన్ను కలచివేసింది. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి" అని పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.

ఈ ప్రమాదంపై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా స్పందిస్తూ, ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించిందని తెలిపారు. బాధ్యులను గుర్తించి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని, విచారణలో తేలిన అంశాల ఆధారంగా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని థాంగ్‌స్కూ ప్రాంతంలో ఉన్న అనుమానిత అక్రమ బొగ్గు గనిలో ఈ పేలుడు జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 16 మృతదేహాలను వెలికితీసినట్లు జిల్లా ఎస్పీ వికాశ్ కుమార్ ధ్రువీకరించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.

Tags

Next Story