New Year 2026: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

ప్రపంచమంతా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ, దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో అద్భుతమైన ఏడాది కావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ముర్ము, మోదీ ట్వీట్లు పెట్టారు. వారితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా విషెస్ చెప్పారు. నూతన సంవత్సర శుభ సందర్భంగా, దేశవిదేశాలలో ఉన్న భారతీయ పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. 2026 సంవత్సరం అందరి జీవితాల్లో శాంతి, ఆనందం, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు. మరింత బలమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి కొత్త శక్తిని నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.
"భారత్‌తోపాటు అన్ని దేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం నూతన శక్తికి, సానుకూల మార్పులకు ప్రతీక. ఇది ఆత్మపరిశీలన, కొత్త సంకల్పాలకు కూడా ఒక అవకాశం. ఈ సందర్భంగా, దేశాభివృద్ధి, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ పట్ల మన నిబద్ధతను మరింత బలోపేతం చేసుకుందాం" అంటూ ముర్ము పిలుపునిచ్చారు.
చేసే ప్రతి పనిలో విజయం!
2026 సంవత్సరం అందరికీ అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. రాబోయే సంవత్సరం అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సును తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ప్రయత్నాల్లో విజయం సాధించాలని, వారు చేసే ప్రతి పనిలో విజయం నెరవేరాలని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. సమాజంలో శాంతి, ఆనందం నెలకొనాలని ఎక్స్ వేదికగా మోదీ రాసుకొచ్చారు.
ప్రజల సమష్టి సంకల్పాన్ని!
2026 భారత్ బలమైన దేశంగా మార్చాలనే సంకల్పాన్ని బలపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరం అందరికీ శాంతి, మంచి ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సును తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే ప్రజల సమష్టి సంకల్పాన్ని ఇది బలోపేతం చేస్తుందని ఆయన ప్రార్థించారు.
ప్రజలకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు
కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు (LoP) రాహుల్ గాంధీ కూడా ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం, విజయాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

