PM Modi: బాధితులను మద్దతుదారులను ఒకే త్రాసులో తూకం వేయలేమన్న మోదీ

బ్రిక్స్ వేదికగా ప్రధాని మోడీ పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దాయాది దేశం తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశం ఉగ్రవాద బాధిత దేశమని.. పాకిస్థాన్ మాత్రం మద్దతుదారు అని తెలిపారు. బాధితులను మద్దతుదారులను ఒకే త్రాసులో తూకం వేయలేమని చెప్పారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోడీ ప్రసంగించారు. పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించిన దేశాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. భారదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ధన్యవాదాలు చెప్పారు. ఉగ్రవాదులకు నిశ్శబ్దంగా అనుమతి ఇవ్వడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాద వ్యాప్తికి వ్యతిరేకంగా మాట్లాడని.. ఏమీ చేయని వారిని కూడా పరోక్షంగా మోడీ ప్రస్తావించారు. ఇక పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులకు ఎలా ఆశ్రయం కల్పిస్తుందో భారత్ స్పష్టమైన ఆధారాలను చూపించింది.
పహల్గామ్ ఉగ్రదాడి మొత్తం మానవాళిపై జరిగిన దాడిగా మోడీ అభివర్ణించారు. ఉగ్రవాదంపై ప్రపంచ వ్యాప్తంగా ఐక్యంగా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. పహల్గామ్ ఘటన అమానుషం, పిరికితనంతో కూడిన ఉగ్రదాడిగా పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుని బోధనల నుంచి ప్రేరణ పొంది.. భారతదేశం శాంతి మార్గాన్ని కొనసాగిస్తుందన్నారు. ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మానవాళి సంక్షేమానికి శాంతి ఉత్తమ మార్గంగా మిగిలిపోయిందని చెప్పారు.
2026లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడిని బ్రిక్స్ గ్రూప్ నాయకులంతా ఖండించారు. నేరపూరితమైనది, అన్యాయమైనదిగా రియో డి జనీరో డిక్లరేషన్ ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది. ‘‘2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలిక, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, సురక్షిత స్వర్గధామాలు వంటి అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మా నిబద్ధతను మేము పునరుద్ఘాటిస్తున్నాము.’’ అని పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండా ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com