Narendra Modi: మన జెన్-జెడ్‌లో ఎంతో సృజనాత్మకత ఉంది: నరేంద్ర మోదీ

Narendra Modi: మన జెన్-జెడ్‌లో ఎంతో సృజనాత్మకత ఉంది: నరేంద్ర మోదీ
X
స్టార్టప్ విప్లవానికి యువశక్తే కారణమని మోదీ వ్యాఖ్య

నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా దేశ యువతపై తనకు ఎప్పుడూ మంచి విశ్వాసం ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన జెన్-జెడ్ తరం సృజనాత్మకతతో నిండి ఉందని ఆయన ప్రశంసించారు. 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్' ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వివేకానందుడి జీవితం, బోధనల నుంచి స్ఫూర్తి పొంది 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్' వేదికను స్థాపించినట్లు తెలిపారు. నేటి యువత కేవలం కొత్త ఆలోచనలతో సరిపెట్టుకోకుండా, అంకితభావంతో దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరుపుకునే జాతీయ యువజన దినోత్సవం రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సందర్భోచితమని, వివేకానందుడి బోధనల స్ఫూర్తితోనే యువత కోసం ఇలాంటి వేదికలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఆయన వివరించారు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న స్టార్టప్ విప్లవం యువశక్తికి నిదర్శనమని, గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల యువతకు అనేక అవకాశాలు లభిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

వినూత్న ఆలోచనలు, లక్ష్యాలు, ఉత్సాహంతో దేశ నిర్మాణంలో జెన్-జెడ్ ముందు వరుసలో ఉందని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో యువత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువచ్చిందని చెప్పారు. ఈ క్రమంలోనే దేశంలో స్టార్టప్ విప్లవం ఊపందుకుందని అన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రారంభించిన సంస్కరణల పరంపర ఇప్పుడు సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌గా మారిందని, వీటికి కేంద్ర బిందువు యువతే అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా సంస్కృతి, సృజనాత్మకత కలగలిసిన ‘ఆరెంజ్ ఎకానమీ’లో భారతదేశం సాధిస్తున్న అద్భుతమైన వృద్ధికి యువత ఇస్తున్న కంటెంట్ , వినూత్న ఆలోచనలే కారణమని మోడీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులను అత్యంత పారదర్శకమైన క్విజ్, వ్యాసరచన , ప్రజెంటేషన్ వంటి మూడు దశల ఎంపిక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది నుండి ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి అవసరమైన ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌’కు యువశక్తే ఇంధనమని, 2047 నాటికి వికసిత్ భారత్‌ను నిర్మించడంలో నేటి జెన్ జెడ్ యువత కీలక భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Tags

Next Story