PM Modi : దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ లేఖ..!

నవరాత్రి మొదటి రోజైన సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖలో ఆయన దేశ ప్రజలందరికీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించారు. దుకాణదారులు అందరూ ‘భారతదేశంలో తయారు చేసిన’ ఉత్పత్తులను విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. ‘మనం గర్వంగా చెప్పుకుందాం – మనం కొనేది స్వదేశీ, మనం అమ్మేది స్వదేశీ’ అని ప్రధాని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. దేశంలో నూతన GST సంస్కరణలు అమలులోకి రావడంతో తగ్గిన GST రేట్లు 375 వస్తువులపై వర్తిస్తాయని పేర్కొన్నారు. ఆటోమొబైల్స్ నుంచి రోజువారీ వినియోగ వస్తువుల వరకు ఈ జీఎస్టీ తగ్గింపు జరిగిందని తెలిపారు.
జాతినుద్దేశించి ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఆదాయపు పన్ను సంస్కరణలతో పాటు, నేటి నుంచి అమల్లోకి వచ్చే జీఎస్టీ రేటు సవరణలతో భారతీయులు ₹ 2.5 లక్షల కోట్లు ఆదా అవుతుందన్నారు. ప్రధాని దీనిని “బచత్ ఉత్సవ్” గా అభివర్ణించారు. తగ్గిన జీఎస్టీ రేట్లు పేదలకు, మధ్యతరగతికి గొప్ప ఉపశమనం కలిగిస్తాయని చెప్పారు. ఈ సంస్కరణలతో యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారులు, వ్యవస్థాపకులు అందరూ గొప్ప ప్రయోజనం పొందుతారని అన్నారు. పండుగ సీజన్‌లో జీఎస్టీ తగ్గింపు అనేది ప్రజలకు మరింత ఆదా అవుతుందన్నారు. కొత్త జీఎస్టీ విధానం మధ్యతరహా, చిన్న వ్యాపారాలపై చూపే సానుకూల ప్రభావాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఇది పోటీతత్వాన్ని, ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని అన్నారు.
జీఎస్టీ తగ్గింపుతో స్నాక్స్, కాఫీ, నెయ్యి, పనీర్, వెన్న, కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీం వంటి రోజువారీ వినియోగ వస్తువులపై రేట్లు తగ్గుతాయి. టీవీలు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వస్తువులపై కూడా GST తగ్గించారు. ఔషధాలపై 12% నుంచి 5% జీఎస్టీ తగ్గించారు. క్యాన్సర్, జన్యుపరమైన, అరుదైన వ్యాధులకు కీలకమైన ప్రాణాలను రక్షించే మందులను పూర్తిగా పన్ను నుంచి మినహాయించారు. గతంలో 12% GSTని కలిగి ఉన్న దాదాపు 99% వస్తువులు ఇప్పుడు 5% పన్ను స్లాబ్ కిందకు వచ్చాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com