లోక్ సభ స్థానాల పెంపుపై ప్రధానీ కీలక వ్యాఖ్యలు
త్వరలో పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయంటూ ప్రధాని మోదీ హింట్ ఇచ్చారు. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభ స్థానాల పెంపుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో ఎంపీ స్థానాలు పెరుగుతాయని చెప్పారు. అందుకు తగ్గట్లుగానే అధునిక వసతులతో కొత్త భవానాన్ని నిర్మించామని తెలిపారు.
పాత పార్లమెంటు భవనంలో కార్యకలాపాలు సాగించడం ఎంత కష్టంగా ఉండేదో మీకు తెలుసు. కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అందుకే కొత్త పార్లమెంట్ భవనం నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని వివరించారు. 2026 తర్వాత జరిగే మొదటి జనగణన ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నారు ప్రధాని మోదీ.
పార్లమెంట్ నూతన భవనాన్ని 1,272 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా నిర్మించారు. ప్రస్తుతం లోక్‌సభ స్థానాల సంఖ్య 545. చివరగా 1971 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్ సీట్ల డీలిమిటేషన్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్ సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు జరగలేదు. ఎంపీ స్థానాల సంఖ్య 2026 సంవత్సరం వరకు యతాథతంగా ఉండే ఛాన్స్ ఉంది. ఆ తర్వాతే లోక్‌సభ, రాజ్యసభ సీట్లు పెరిగే అవకాశం ఉంది.
పాత లోక్‌సభలో గరిష్టంగా 552 మంది మాత్రమే కూర్చునే వీలుండగా.. కొత్త లోక్‌సభ భవనం 888 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. పాత రాజ్యసభ భవనంలో 250 మంది సభ్యులు కూర్చునే సామర్థ్యం ఉండగా, కొత్త రాజ్యసభ హాలు సామర్థ్యాన్ని 384కి పెంచారు. కొత్త పార్లమెంట్ హౌస్‌లో ఉభయ సభల సమావేశం సందర్భంగా 1,272 మంది సభ్యులు కూర్చునే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్‌లో పార్లమెంట్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com