PM Modi: బ్రూనై, సింగపూర్ పర్యటనకు ప్రధాని మోడీ

మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రూనై దారుస్సలాం, సింగపూర్ పర్యటనలకు బయలుదేరి వెళ్లారు. బ్రునైలో భారత ప్రధాని మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఇవాళ, రేపు మోదీ బ్రునైలో పర్యటిస్తారు. ఆ తరువాత సింగపూర్ బయలుదేరి వెళ్తారు. విదేశీ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మోదీ ట్విటర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. బ్రూనై దారుస్సలాంలో మొట్టమొదటిసారిగా ద్వైపాక్షిక పర్యటనకు వెళ్తున్నాను. ఇరు దేశాల దౌత్య సంబంధాలకు 40 సంవత్సరాల సందర్భంగా, చారిత్రక సంబంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చడానికి హిజ్ మెజెస్టి సుల్తాన్, హాజీ హసనల్ బోల్కియా, ఇతర రాజకుటుంబ సభ్యులతో సమావేశాలు ఉంటాయని మోదీ తెలిపారు.
మోదీ బ్రునై నుండి రేపు సాయంత్రం సింగపూర్ బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి థర్మన్ షణ్ముగరత్నం, ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్, సీనియర్ మంత్రి లీ సియన్ లూంగ్, ఎమిరిటస్ సీనియర్ మంత్రి గో చోక్ టోంగ్‌లతో సింగపూర్లో సమావేశాలు ఉంటాయని, సింగపూర్ పర్యటనలో అక్కడి బిజినెస్ ఆర్గనైజేషన్ సంఘాలతోను సమావేశం ఉంటుందని మోదీ తెలిపారు. బ్రూనై, సింగపూర్‌లతో భారత్ వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు, ఆసియాన్ కూటమితో తమ బంధాన్ని బలోపేతం చేసేందుకు ఈ పర్యటనలు ఎంతగానో దోహదపడతాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత్ ‘‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’’ మరియు ఇండో-పసిఫిక్ విజన్‌లో ఈ రెండు దేశాలు ముఖ్యమైన భాగస్వాములుగా ఉన్నా్యని ఆయన అన్నారు. ‘‘బ్రూనై, సింగపూర్ ఆసియాన్ ప్రాంతంలో మా భాగస్వామ్యాన్ని నా పర్యటన మరింత బలోపేతం చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను’’ ప్రధాని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com