PM Modi Review: ప్రధాని మోడీతో రక్షణశాఖ కార్యదర్శి కీలక భేటీ

PM Modi Review:  ప్రధాని మోడీతో రక్షణశాఖ కార్యదర్శి కీలక భేటీ
X
రెండు రోజుల వ్యవధిలోనే 3వ సారి రక్షణశాఖతో ప్రధాని

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్‌- పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు భగ్గుమంటున్నాయి. అలాగే, తదుపరి చర్యలపై కేంద్ర ప్రభుత్వం పలు కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఇవాళ (మే 5న) రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంతో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ప్రధాన మంత్రి- రక్షణ శాఖ ఉన్నతాధికారుల మధ్య జరిగిన మూడవ అత్యున్నత స్థాయి మీటింగ్ అని చెప్పొచ్చు.

అయితే, పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు ప్రధాని మోడీ. లక్ష్యాలు, దాడి సమయం త్వరలోనే నిర్ణయిస్తామని సీసీఎస్‌ తెలిపింది. తాజాగా, యూపీలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై వాయుసేన యుద్ధ విమానాల ల్యాండిగ్‌, టేకాఫ్‌ విన్యాసాలను కొనసాగించింది. ఇక, వరుసగా నౌకాదళాధిపతి అడ్మిరల్‌ దినేష్‌ కె.త్రిపాఠి, తర్వాత ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్.. మోడీతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈరోజు రక్షణశాఖ కార్యదర్శి సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా, ఉగ్రదాడి తర్వాత భారత్ ఇప్పటి వరకు సైనికంగా బదులివ్వలేదు.. పాకిస్థాన్‌ను అష్టదిగ్బంధం చేస్తోంది. సింధు జలాలను నిలిపివేయడంతో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరి అవుతుండగానే.. బగల్హార్‌ జలాశయం నుంచి నీటి సరఫరాను ఆపేసింది భారత్‌. అలాగే, విద్యుద్ ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టు నుంచి నీరు వదలకపోవడంతో పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్సుకు సాగు నీరు అందడం లేదు. ఇక, జీలం నదిపై ఉన్న కిషన్‌గంగ జలాశయం నుంచి కూడా నీటిని పాక్‌కు వెళ్లనివ్వకుండా అడ్డుకోవాలని మోడీ సర్కార్ యోచిస్తోంది. కాశ్మీర్‌లోని రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తుండటంతో పాక్‌కు ఊపిరి సలపడం లేదని చెప్పాలి.

Tags

Next Story