Sudarshan Setu : దేశంలోనే పొడవైన కేబుల్ బ్రిడ్జి

Sudarshan Setu : దేశంలోనే పొడవైన కేబుల్ బ్రిడ్జి
జాతికి అంకితం చేసిన మోడీ

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వీటిలో ముఖ్యమైన ప్రాజెక్టు సుదర్శన్ సేతు ఒకటి. గుజరాత్ లోని ద్వారకలో దేశంలోనే అత్యంత పొడవైన తీగల వంతెనే ఈ సుదర్శన్ సేతు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దీనికిముందు ప్రధాని మోదీ ద్వారక ఆలయంలో పూజలు నిర్వహించారు.

సుదర్శన్ సేతు దేశంలోనే అతిపొడవైన సిగ్నేచర్ బ్రిడ్జిగా నిలిచింది. ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ సుమారు 980కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు. సుదర్శన్ సేతు వంతెనను ఓఖా -బెట్ ద్వారకా బ్రిడ్జ్ గానూ పిలుస్తారు. ఈ వంతెన కారణంగా లక్షద్వీప్ లో నివసిస్తున్న సుమారు 8,500 మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది. సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారక చేరుకోవడానికి ప్రయాణికులు ఇబ్బందిపడేవారు. పడవపైనే ఆధారపడాల్సి వచ్చేది. వాతావరణం ప్రతికూలంగా ఉంటే ప్రయాణానికి మరింత జాప్యం జరిగేది. ఈ వంతెన నిర్మితం కావడంతో భక్తుల కష్టాలు తీరనున్నాయి. సుదర్శన్ సేతు ప్రత్యేకమైన డిజైన్లను కలిగి ఉంది. ఈ వంతనెపై భగవద్గీతలోని శ్లోకాలు, రెండు వైపులా శ్రీకృష్ణుడి చిత్రాలతో అలంకరించబడిన కాలిబాట కూడా ఉంది. 2017 అక్టోబర్ లో ప్రధాని నరేంద్ర మోదీ వంతెనకు శంకుస్థాపన చేశారు. సుదర్శన్ సేతు ఫుట్ పాత్ పైభాగాల్లో సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

ఆ తరువాత ప్రధాని మోదీ పలు ప్రారంభోత్సవాల్లోనూ పాల్గొన్నారు. మధ్యాహ్నం రాజ్‌ కోట్‌ లోని (గుజరాత్) తొలి ఎయిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. ఆ తరువాత ఏపీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ లోని ఎయిమ్స్ ఆసుపత్రులను కూడా వర్చువల్‌ గా ప్రారంభిస్తారు. ఈ ఐదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను మొత్తం రూ.6,300 కోట్లతో ప్రభుత్వం నిర్మించారు.

Tags

Next Story