Amrit Railway Stations: దేశవ్యాప్తంగా ‘అమృత్’ రైల్వే స్టేషన్ల ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం

Amrit Railway Stations: దేశవ్యాప్తంగా ‘అమృత్’ రైల్వే స్టేషన్ల  ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
X
అభివృద్ధి పనులను 2023 ఆగస్టులో ప్రధాని మోదీ ప్రారంభించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 22 (గురువారం) నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 103 పునర్వికసిత రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. రూ.1,100 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణమైన ఈ రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS) లో భాగంగా అభివృద్ధి చెంది ప్రయాణికులకు ఆధునిక వసతులతో కూడిన హబ్‌లుగా మారనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 86 జిల్లాల్లో ఉన్న ప్రధానమైన, చిన్న రైల్వే స్టేషన్లు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, కేరళ, చత్తీస్‌గఢ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పొండిచ్చేరిలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని సుల్లూరు‌పేట రైల్వే స్టేషన్, తెలంగాణ లోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లు ఈ స్కీమ్ కింద ఆధునీకరించారు. ఈ స్టేషన్లను ప్రాంతీయ శైలిలో ఆకృతీకరించి, ఆధునిక ప్రయాణిక వసతులు, క్లీన్ టాయిలెట్లు, డిజిటల్ డిస్ప్లేలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు వంటి ఎన్నో ఆధునికతలతో తీర్చిదిద్దారు. ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, బికానీర్ – ముంబయి మధ్య నూతన ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. అదే విధంగా దేశ్నోక్ లోని కర్నీ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశ్నోక్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అభివృద్ధి కార్యక్రమం ద్వారా భారతీయ రైల్వేలు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక అనుభవాన్ని అందించనున్నాయి.

Tags

Next Story