MODI: ప్రవాసీ భారతీయులే.. దేశ రాయబారులు: మోదీ
ప్రవాస భారతీయులను ఎల్లప్పుడూ దేశ రాయబారులుగానే పరిగణిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను కలిసి వారితో మాట్లాడినప్పుడు సంతోషంగా ఉంటుందన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 18వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులో మోదీ పాల్గొన్నారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది మాత్రమే కాదని మన జీవితంలో ఒక అంతర్భాగమని మోదీ తెలిపారు. భారతీయులు ఎక్కడికి వెళ్లినా స్థానిక సమాజంతో కనెక్ట్ అవుతారు, అక్కడి సంప్రదాయాలను గౌరవిస్తారని ప్రశంసించారు. గత దశాబ్ద కాలంలో అనేక మంది ప్రపంచ నాయకులను కలిశానని, వారందరూ ప్రవాస భారతీయులను మెచ్చుకున్నారని నొక్కి చెప్పారు.
ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
ప్రవాస భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించింది. భువనేశ్వర్‌లో జరుగుతున్న 18వ ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఈ రైలును వర్చువల్‌గా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎన్ఆర్ఐ టూరిస్టుల కోసం ఈ రైలును స్టార్ట్ చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు బయలుదేరింది. మూడు వారాల పాటు ప్రయాణం కొనసాగనుంది. దేశంలోని పలు సంప్రదాయ, మతపరమైన ప్రదేశాలను ఈ రైలు చుట్టివస్తుంది. ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన కింద దీనిని నిర్వహిస్తున్నారు.
అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
దేశంలో ఎంతో వేగంగా అభివృద్థి జరుగుతోందని గత పదేళ్లలో దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. త్వరలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, దానికి ఎంతో దూరం లేదని తెలిపారు. భారతదేశంలోని ప్రతి రంగం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని.. పునరుత్పాదక ఇంధనం, విమానయానం, ఎలక్ట్రిక్ మొబిలిటీలో రికార్డులు సృష్టిస్తోందని తెలిపారు. మెట్రో నెట్‌వర్క్‌లు, బుల్లెట్ రైలు ప్రాజెక్టులు, ఫైటర్ జెట్లు, రవాణా విమానాలను తయారు చేస్తోందని గుర్తు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com