PM Modi: ఓటమి నిరాశకు పార్లమెంట్ యుద్ధభూమి కాదు-విపక్షాలకు ప్రధాని మోదీ హితవు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో డ్రామాలు వద్దని, దేశానికి అవసరమైన 'డెలివరీ' (ఫలితాలు) పైనే దృష్టి పెట్టాలని సోమవారం స్పష్టం చేశారు. నినాదాలు చేయడానికి బయట చాలా వేదికలు ఉన్నాయని, పార్లమెంటును మాత్రం విధాన రూపకల్పనకు పరిమితం చేయాలని ఆయన గట్టిగా సూచించారు. సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ఎదుట మాట్లాడిన ప్రధాని, ఫలవంతమైన చర్చలు జరగాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.
ఈ శీతాకాల సమావేశాలు కేవలం ఒక సంప్రదాయం కాదని, దేశాన్ని శరవేగంతో ప్రగతి పథంలో నడిపించే ప్రయత్నాలకు కొత్త శక్తినిచ్చే మార్గమని ప్రధాని అన్నారు. "భారతదేశం ప్రజాస్వామ్య స్ఫూర్తితో జీవిస్తోంది. ఇటీవలి బీహార్ ఎన్నికల్లో భారీగా పోలైన ఓటింగ్, ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం పెరగడం ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని బలపరిచింది. ప్రజాస్వామ్యం ద్వారా ఫలితాలు సాధించగలమని భారత్ నిరూపించింది. ప్రపంచం మన ప్రజాస్వామ్య, ఆర్థిక వ్యవస్థల బలాన్ని నిశితంగా గమనిస్తోంది" అని ఆయన వివరించారు.
విపక్షాల వైఖరిని ప్రధాని తీవ్రంగా తప్పుబట్టారు. "దేశం కోసం పార్లమెంటు ఏం ఆలోచిస్తోంది, ఏం చేయాలనుకుంటోంది అనే దానిపై ఈ సమావేశాల్లో దృష్టి సారించాలి. ఇటీవలి ఎన్నికల ఓటమి బాధ నుంచి విపక్షాలు బయటకు వచ్చి, తమ బాధ్యతను నిర్వర్తించాలి. కానీ దురదృష్టవశాత్తూ కొన్ని రాజకీయ పార్టీలు తమ ఓటమిని అంగీకరించలేకపోతున్నాయి" అని మోదీ విమర్శించారు. బీహార్ ఎన్నికలు ముగిసి రోజులు గడిచినా, వారి మాటలు వింటుంటే ఓటమి బాధ ఇంకా వదిలినట్టు లేదని ఆయన ఎద్దేవా చేశారు.
సభలో కొత్తగా ఎన్నికైన, యువ ఎంపీలకు మాట్లాడే అవకాశం లభించడం లేదని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. "తొలిసారి ఎన్నికైన వారు, యువతరం ఎంపీలు సభలో మాట్లాడలేకపోతున్నారు. తమ ప్రాంత సమస్యలను వినిపించలేకపోతున్నారు. దేశాభివృద్ధికి అనుకూలంగా మాట్లాడినా వారిని అడ్డుకుంటున్నారు. వారికి అవకాశం కల్పించడం మనందరి బాధ్యత" అని ఆయన అన్నారు.
"డ్రామాలు చేయడానికి చాలా చోట్లున్నాయి, ఎవరైనా అక్కడ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జరగాల్సింది డెలివరీ, డ్రామా కాదు. నినాదాలు చేయడానికి దేశం మొత్తం ఉంది. ఎక్కడ ఓడిపోయారో అక్కడ నినాదాలు చేశారు, రేపు ఎక్కడ ఓడిపోతారో అక్కడ కూడా చేయొచ్చు. కానీ పార్లమెంటులో మాత్రం విధానాలపైనే దృష్టి పెట్టాలి" అని ప్రధాని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో నెగిటివిటీ పనికొస్తుందేమో గానీ, దేశ నిర్మాణానికి సానుకూల దృక్పథమే అవసరమని ఆయన హితవు పలికారు.
కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రజా వ్యతిరేకత కారణంగా సొంత రాష్ట్రాల్లో పర్యటించలేని స్థితిలో ఉన్నాయని, అలాంటి పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సి.పి. రాధాకృష్ణన్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

