Waqf Amendment Bill: వక్ఫ్‌ బిల్లు ఆమోదం.. చరిత్రాత్మక మలుపన్న ప్రధాని

Waqf Amendment Bill: వక్ఫ్‌ బిల్లు  ఆమోదం.. చరిత్రాత్మక మలుపన్న ప్రధాని
X
ట్విట్టర్ వేదికగా స్పందించిన మోడీ

పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోడీ స్పందించారు. ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇది కీలక పరిణామం అని పేర్కొన్నారు. దశాబ్దాలుగా వక్ఫ్‌ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్నారు. తాజాగా బిల్లు ఆమోదంతో అట్టడుగున ఉన్న వర్గాలకు మేలు చేకూరుతుందని తెలిపారు. అంతేకాకుండా వారి గళం వినిపించే అవకాశం దక్కుతుందని చెప్పుకొచ్చారు.

‘‘పార్లమెంట్ ఉభయ సభలు వక్ఫ్ (సవరణ) బిల్లు మరియు ముస్సల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లును ఆమోదించడం కీలక పరిణామం. సామాజిక-ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి కోసం సమిష్టి అన్వేషణలో ఒక కీలకమైన ఘట్టం. ముఖ్యంగా చాలా కాలంగా అట్టడుగున ఉన్న ప్రజలకు ఎంతగానో సహాయపడుతుంది.’’ అని మోడీ ట్వీ్ట్ చేశారు.

12 గంటల పాటు చర్చ తర్వాత శుక్రవారం అర్ధరాత్రి దాటిన అనంతరం రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు లోపాలు ఎత్తిచూపాయి. మొత్తానికి ఉభయ సభల్లో సులువుగానే బిల్లు ఆమోదం పొందడం విశేషం. ఇక ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరకు వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే.. చట్టం అమల్లోకి రానుంది.

వక్ఫ్‌ బిల్లుపై బుధవారం లోక్‌సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. అనంతరం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్‌ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు.

ఇక ఈ బిల్లు ముస్లింల ప్రయోజనాలకు హాని కలిగిస్తుందనే ఆరోపణలను మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. ఈ బిల్లుతో ముస్లింలకే లాభమని.. బిల్లు ఆమోదంతో ముస్లిమేతరులు ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరని పేర్కొన్నారు. అయినా ఈ బిల్లు మతానికి సంబంధించింది కాదని.. ఆస్తి, దాని నిర్వహణకు, అవినీతిని నిర్మూలించడమే ఈ బిల్లు లక్ష్యమని తెలిపారు.

Tags

Next Story