Bihar: ఎన్నికల వేళ బీహార్ మహిళలకు మోడీ దసరా కానుక.. ఖాతాల్లో రూ.10 వేలు జమ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు దసరా కానుక అందింది. శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున ఖాతాల్లో జమయ్యాయి. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించే దిశగా రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ పవిత్ర నవరాత్రి పండుగలో మహిళల ఆశీస్సులు తమకు గొప్ప బలం అని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు మోడీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సోదరీమణులందరికీ ఈరోజు రూ.10 వేలు చేరుతాయని చెప్పారు. ఒకప్పుడు దోపిడీ ఎలా జరిగిందో అందరికీ తెలిసిందేనని.. గతంలో ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపిస్తే.. చివరికి 15 పైసలు మాత్రమే చేరేదని ఆరోపించారు. మధ్యలో దోచుకునే వారు ఉండడంతో చాలా అన్యాయం జరిగిందని వివరించారు. ఇప్పుడు అలా కాకుండా నేరుగా అకౌంట్లలో రూ. 10 వేలు పడిపోతున్నాయని చెప్పారు.
తన సోదరి ఆరోగ్యంగా.. సంతోషంగా ఉన్నప్పుడే, కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే సోదరుడు సంతోషంగా ఉంటాడని పేర్కొన్నారు. ఇందుకోసం మీ సోదరుడు అవసరమైంది చేస్తాడని తెలిపారు. ఈరోజు ఇద్దరు సోదరులు మోడీ, నితీష్ కుమార్.. మీ శ్రేయస్సు కోసం, ఆత్మగౌరవం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకు నేటి పనే దీనికి ఉదాహరణ అన్నారు. ఈ పథకం గురించి నితీష్ కుమార్ చెప్పినప్పుడు దార్శనికతను చూసి చాలా సంతోషించినట్లు తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ కచ్చితంగా లబ్ధి పొందుతుందని వివరించారు.
మన కుమార్తెలు ఇప్పుడు యుద్ధ విమానాలు నడుపుతున్నారని.. కానీ ఒకప్పుడు బీహార్‌లో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పటి రోజులు ఎవరూ మరిచిపోకూడదన్నారు. అదంతా లాంతరు పాలన.. ఆ సమయంలో మహిళలు అక్రమం, అవినీతి భారాన్ని భరించారని గుర్తుచేశారు. అప్పట్లో ప్రధాన రోడ్లు శిథిలావస్థకు చేరినప్పుడు.. ఎక్కువగా మహిళలే ఇబ్బందులు పడ్డారని తెలిపారు. గర్భిణీ స్త్రీలు సకాలంలో ఆస్పత్రులకు చేరుకోలేక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారని జ్ఞాపకం చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకుండా రాత్రింబవళ్లు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మోడీ చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com