నేను మోదీ అభిమానిని : ఎలన్ మస్క్

తాను మోడీ అభిమానిని అంటూ ప్రధానిపై అభినందనల జల్లు కురిపించారు అపరకుబేరుడు, టెస్లా సిఈఓ, ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్. భారతదేశ అభివృద్ధి కోసం మోడీ నిరంతరము ఆలోచిస్తున్నారనన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి టెస్లాను రమ్మని ఆహ్వానించారని అన్నారు. సరైన సమయంలో ఆ విషయంపై ప్రకటన చేస్తామన్నారు.
మూడు రోజుల అమెరికా పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ మంగళవారం న్యూయార్క్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్పోర్ట్ లో మోదీ నినాదాల మధ్య ఘన స్వాగతం లభించింది ఆయనకు. ఈ క్రమంలో న్యూయార్క్‌లో, అమెరికా పర్యటన తొలిరోజే టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారత్ లో పెట్టుబడులు, టెక్నాలజీ విషయంలో సహాయం తదితర అంశాలపై ఇద్దరి మధ్య జరిగింది. ప్రధాని మోడీతో సమావేశం అనంతరం ఎలన్ మస్క్ మీడియాతో మాట్లాడుతూ భారత ప్రధానికి దేశాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. అందుకే భారత్ రావాలని ఆయన ఒత్తిడి చేస్తున్నారనీ, భవిష్యత్ ఇండియాను తలుచుకుంటే చాలా ఆనందంగా ఉందన్నారు.
ప్రధానితో సమావేశం చాలా ఉత్సాహ పూరిత వాతావరణంలో జరిగిందన్న మస్క్..త్వరలో భారత్ పర్యటనను రానున్నట్లు ప్రకటించారు. భారతదేశంలో సౌర శక్తి పెట్టుబడులకు ఎంతో ఆస్కారం ఉందన్నారు. అందుకే స్టార్ లింక్ ఇంటర్నెట్ ను ఇండియాకు తీసుకురావటం ద్వారా మారుమూల పల్లె ప్రాంతాలకు ఇంటర్నేట్ సేవలను అందించేందుకు అవకాశంపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు మస్క్ తెలిపారు. చాలా సంవత్సరాల క్రితం మోదీ తమ ఫ్రెమాంట్ కర్మాగారాన్ని సందర్శించారని 2015 నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. టెస్లా భారతదేశంలోకి ప్రవేశిస్తుందని తాను నమ్ముతున్నానని, భవిష్యత్తులో భారతదేశానికి గణనీయమైన పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. మోదీ కొత్త కంపెనీలను స్వాగతించి వారికి అండగా నిలవాలనుకుంటున్నారని, ప్రతి కార్యక్రమం లోనూ భారత్‌కు ప్రయోజనం కలిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. జూన్ 20 నుంచి 25 వరకు ప్రధాని మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటన జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com