ప్రేరణ కేంద్రంగా..మోడీ చిన్ననాటి స్కూల్

ప్రధాని నరేంద్ర మోదీ చిన్నప్పుడు చదివిన స్కూల్‌ను ప్రేరణ కేంద్రంగా మార్చబోతున్నారు.పిల్లలకు స్ఫూర్తినిచ్చే కేంద్రంగా పనిచేయడానికి ప్రేరణ ప్రాజెక్ట్ కింద తిరిగి అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.గుజరాత్‌లోని వాద్నగర్, దర్బర్‌గధ్ ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలను అందరూ సందర్శించి,ప్రేరణ పొందేవిధంగా తీర్చిదిద్దబోతున్నట్లు అధికారులు తెలిపారు.కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఓ బృందం గత మార్చి10న ఈ స్కూల్‌ను సందర్శించి మోదీ చదివిన బడిని ప్రేరణ కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.దీనిని అభివృద్ధి చేయడానికి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు.
ఇక మోదీ చదివిన పాఠశాల దాదాపు 100 సంవత్సరాల క్రితం నాటిది. దీనిలో చాలా భాగం శిథిలావస్థలో ఉంది. దీంతో కొంత భాగాన్ని మూసివేశారు. ప్రధాని పూర్వీకుల నివసించిన ఇంటికి దగ్గరలోనే ఈ బడి ఉంది.ఇక్కడ హటకేశ్వర్ దేవాలయం,సోలంకి శకం నాటి కీర్తి తోరణం తదితర పురాతన కట్టడాలు కూడా ఉన్నాయి. దీంతో ఆధ్యాత్మిక కోణంలో కూడా అభివృద్ధి చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు.19వ శతాబ్దం చివరలో నిర్మించబడిన ఈ పాఠశాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పాత నిర్మాణ శైలిలోనే పునరుద్ధరించింది.
మరోవైపు ఈ బడి భవిష్యత్‌లో ఇతర పాఠశాలలకు, విద్యా విలువలకు ఊతమివ్వనుందని అధికారులు అంటున్నారు.ప్రేరణ కార్యక్రమంలో భాగమయ్యే ప్రతి విద్యార్ధికి అవసరమైన అన్ని ఖర్చులను కేంద్ర ప్రభుత్వం భరించనుంది.దేశంలోని ప్రతి జిల్లా నుండి ఇద్దరు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 50 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమం వరుస బ్యాచ్‌లలో నిర్వహించబడుతుంది. ప్రతి బ్యాచ్‌లో 30 మంది విద్యార్థులు,15 జిల్లాలను కవర్ చేస్తారు.మొత్తం 750 జిల్లాలు,పదిహేను వందల మంది విద్యార్థులను కవర్ చేయనున్నారు.
ఈ ప్రేరణ పాఠశాలలో ప్రత్యేకమైన బోధన ఉంటుందని ఇది భవిష్యత్తులో మార్పుకు నాంది పలకనుందని కేంద్ర సాంస్కృతిక శాఖ అభిప్రాయ పడింది. సాంప్రదాయ,సాంకేతిక-మార్గాలను అన్వేషించే విధంగా బోధన ఉంటుందని అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com