PM Modi: నేడు అఖిల భారత డీజీపీల సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని
దేశ భద్రతా వ్యవహారాలపై ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని లోక్‌సేవాభవన్ కన్వెన్షన్ సమావేశ మందిరంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయింది. దీన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరంభించారు. ఈ కార్యక్రమంలో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోభాల్ తో పాటు అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు, ఇంటిలిజెన్స్, కోస్ట్‌గార్డ్, సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ శాఖల ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు. కాగా, ఈ సదస్సులో ఈరోజు ( నవంబర్ 30) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.
ఇక, ఇటీవల కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. మహిళలపై హత్యాచార ఘటనలు క్రమంగా పెరిగాయి. దీంతో బ్రిటిష్ కాలం నాటి చట్టాలను భూస్థాపితం చేసి భారతీయ న్యాయ సంహిత పేరిట కొత్త చట్టాలు తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. వీటన్నింటిపై డీజీపీ, ఐజీల సదస్సులో సుధీర్ఘంగా చర్చ కొనసాగనుంది. అయితే, కొన్ని భద్రతా కారణాల రీత్యా ఈ సదస్సుకు మీడియాను దూరం పెట్టారు. దీనిపై అధికారులెవరూ ఎలాంటి వివరణ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈరోజు ప్రధాని మోడీ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత ఆయన చేసే వ్యాఖ్యలు అధికార ప్రతినిధులు మీడియాకు తెలియజేయనున్నారని సమాచారం. ఇక, భువనేశ్వర్‌లో వీవీఐపీల తాకిడి దృష్టిలో పెట్టుకున్న పోలీసు యంత్రాంగం అడుగడుగునా భారీ బందోబస్తును మోహరించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com