PM Modi: 2 దేశాల పర్యటనకు రేపు వెళ్లనున్న మోడీ

ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం మోడీ జపాన్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఆగస్టు 29-30 తేదీల్లో జపాన్‌లో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలో పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలియజేశారు.
టోక్యోలో జరగనున్న 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొంటారని చెప్పారు. ప్రధాని మోడీ-జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా మధ్య క్వాడ్ గ్రూపింగ్‌పై చర్చలు జరపనున్నట్లు చెప్పారు. ఇదొక ముఖ్యమైన వేదిక అని విక్రమ్ మిస్త్రీ పేర్కొన్నారు.
ఇక ఆగస్టు 30న మోడీ-ఇషిబా మియాగి ప్రిఫెక్చర్‌కు వెళ్లనున్నారు. అక్కడ సెండాయ్‌లోని తోహోకు షింకన్‌సెన్ ప్లాంట్‌ను పరిశీలించనున్నట్లు జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ‘బుల్లెట్ ట్రైన్’ ప్రాజెక్ట్ కోసం 2030లో ఇండియాకు తరలించనున్న E-10 కోచ్‌లను పరిశీలించనున్నారు. అనంతరం ఒక ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక భద్రత, సెమీకండక్టర్ టెక్నాలజీ సహకారం, కృత్రిమ మేధస్సుతో సహా అనేక పత్రాలపై ఇరుపక్షాలు సంకాలు చేయనున్నారు. అలాగే అంతరిక్ష, రక్షణ సహకారాలపై కూడా ఇరువురు చర్చించనున్నారు.
ఇక జపాన్ పర్యటన ముగింపుకుని ఆగస్టు 31న మోడీ చైనాకు చేరుకుంటారు. టియాంజిన్‌లో జరిగే ఎస్‌సీవో సమ్మిట్‌లో పాల్గొననున్నారు. సరిహద్దులో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత మోడీ చైనాకు వెళ్తున్నారు. చైనాలో జరిగే సమ్మిట్‌కు 11 దేశాల నేతలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానించారు. ఇక ఇందులో ప్రధానంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఉన్నారు. ఈ సమ్మిట్‌కు ఎస్‌సీవో దేశాలతో పాటు నేపాల్, మాల్దీవులు, తుర్కియే, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కంబోడియా, మంగోలియా, తుర్క్‌మెనిస్తాన్, లావోస్, అర్మేనియా, అజర్‌బైజాన్ నాయకులంతా సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. చైనాలో టూర్‌లో భాగంగా తొలిసారి జిన్‌పింగ్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com