PM Modi: ఉగ్రవాదుల హేయమైన దాడితో ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంన్న ప్రధాని

ఈ నెల 22న పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన నరమేథం యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆ హేయమైన దాడితో ఇప్పుడు ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందని చెప్పారు. ఆ దాడికి కఠినాతికఠినంగా బదులు తీర్చుకుని తీరుతామని ప్రధాని స్పష్టం చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో మాట్లాడిన ప్రధాని.. పహల్గాం ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించారు.
పహల్గాం ఉగ్రదాడి తనను ఎంతగానో కలచి వేసిందని, ప్రతి భారతీయుడు ఈ దారుణాన్ని మర్చిపోలేకపోతున్నాడని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్ పురోగతిని చూసి ఓర్వలేక ఉగ్రవాదులు ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పహల్గాం పర్యాటకంగా అభివృద్ధి చెందడాన్ని సహించలేక అమాయకులపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరిగేలా తాము చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
జమ్ముకశ్మీర్‌లో గత కొన్నాళ్లుగా శాంతి, సామరస్యం నెలకొన్నాయని, ఆ పరిస్థితిని చెడగొట్టడానికే ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని ప్రధాని ఆరోపించారు. జమ్ముకశ్మీర్ ప్రశాంతంగా ఉండటం ఉగ్రవాదులకు, వాళ్లను పెంచిపోషిస్తున్న వాళ్లకు ఇష్టం లేదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com