PM Modi: కేరళలో మార్పు అనివార్యం.. శబరిమల చోరీపై దర్యాప్తు చేస్తామన్న మోడీ

గుజరాత్‌లో బీజేపీ విజయం ఒక నగరం నుంచి ప్రారంభమైందని, అదే తరహా విజయం కేరళలోనూ పునరావృతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల తిరువనంతపురం నగరంపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ, కేరళలో మార్పు అనివార్యమని ఆయన జోస్యం చెప్పారు.
కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)ల అవినీతిని అంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ పరిస్థితులను పూర్తిగా మార్చివేస్తాయని ఆయన అన్నారు. ఇప్పటివరకు కేవలం రెండు కూటములను మాత్రమే చూశారని ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లను ఉద్దేశించి విమర్శించారు. ఈ రెండు కూటములు రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేరళ ప్రజలు మూడో ప్రత్యామ్నాయం వైపు చూస్తే అభివృద్ధి, సుపరిపాలన సాధ్యమవుతాయని బీజేపీని ఉద్దేశించి అన్నారు. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ల జెండాలు మాత్రమే వేరని, వారి అజెండా మాత్రం ఒక్కటేనని ఆయన విమర్శించారు. ప్రజల అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వం ఇప్పుడు అవసరమని, ఆ బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. బీజేపీపై నమ్మకం ఉంచి కేరళ ప్రజలు తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. "శబరిమలలో జరిగిన బంగారం దొంగతనంపై విచారణ జరిగేలా చూడటం ఈ మోదీ హామీ" అని ఆయన వ్యాఖ్యనించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
