PM Modi: పార్లమెంట్‌ రాజకీయాల కోసం కాదు.. దేశం కోసం: ప్రధాని

PM Modi: పార్లమెంట్‌ రాజకీయాల కోసం కాదు.. దేశం కోసం: ప్రధాని
60ఏళ్ల తర్వాత ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిందన్న మోడీ

రాజకీయాలు చేయడానికి పార్లమెంట్‌ వేదిక కాదని.. దేశం కోసం ఉందని ప్రధాని మోదీ ప్రతిపక్షాలకు హితవు పలికారు. బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో నేడు యావత్ దేశం దృష్టి దీనిపైనే ఉంది. ఇది సానుకూల సెషన్‌గా ఉండాలి. 60 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి మూడో ఇన్నింగ్స్‌లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం దక్కడం గర్వించదగ్గ విషయమని ప్రధాని మోడీ అన్నారు.

ఇది భారత ప్రజాస్వామ్యంలో గౌరవప్రదమైన సంఘటనగా దేశం చూస్తోంది. ఇది అమృతకాలంలో ముఖ్యమైన బడ్జెట్‌. ఈ బడ్జెట్ రాబోయే ఐదు సంవత్సరాల అవకాశాల దిశను నిర్ణయిస్తుంది. 2047లో అభివృద్ధి చెందిన భారతదేశ కలను నెరవేర్చడానికి ఈ బడ్జెట్ బలమైన పునాది వేస్తుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోటీపడి భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందనేది ప్రతి దేశస్థుడికి గర్వకారణం. 8 శాతం వృద్ధితో ముందుకెళ్తున్నాం. భారతదేశంలో సానుకూల దృక్పథం, పెట్టుబడి, పనితీరు వాతావరణం ఉంది. గత మూడేళ్లుగా నిరంతరంగా 8 శాతం వృద్ధిని సాధిస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో పార్టీ కోసం కాకుండా దేశం కోసం పోరాడాల్సిన బాధ్యత ఎన్నికైన ఎంపీలందరిపై ఉంది. రాబోయే నాలుగున్నరేళ్ల పాటు దేశానికి అంకితం కావాలని అన్ని రాజకీయ పార్టీలను కూడా కోరుతున్నాను అన్నారు.

దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేసే దిశగా పార్లమెంట్ సమావేశాలు సాగాలని మోడీ ఎంపీలకు సూచించారు. మూడోసారి అధికారంలోకి వచ్చి తొలి బడ్జెట్ రేపు ప్రవేశపెడుతున్నాం.. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. 2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసేలా బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్‌ సమావేశాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలి. ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలో ఇచ్చేశారు. ఎన్నికల్లో పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. ఈ ఐదేళ్లు అంతా కలిసి దేశాభివృద్ధికి పోరాడాల్సిన అవసరం ఉంది. సభను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. అన్ని పార్టీల్లో పెద్ద సంఖ్యలో కొత్త ఎంపీలు ఉన్నారు.. చర్చలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వండి.. మొదటి సమావేశంలోనే విపక్షాలు సభను అడ్డుకున్నాయి.. నన్ను కూడా మాట్లాడనివ్వలేదు.. వాళ్లకు పశ్చాత్తాపం కూడా లేదు.. ఈ సభ పార్టీల కోసం కాదు, ప్రజల కోసమని ప్రతిపక్షాలను విమర్శించారు.

Tags

Next Story