Rahul Gandhi: స్టాక్ మార్కెట్ స్కామ్‌లో మోదీ, అమిత్ షా : రాహుల్ గాంధీ

ఎగ్జిట్ పోల్స్‌తో స్టాక్ మార్కెట్ స్కాం అంటూ విమర్శ

ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కలిసి స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణానికి పాల్పడ్డారని, దానివల్ల చిన్న మదుపర్లు 30లక్షల కోట్ల మేర నష్టాన్ని చవి చూశారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఇది అతి పెద్ద స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌ అన్నారు. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని.. రాహుల్‌ డిమాండ్‌ చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చిన తర్వాత స్టాక్‌ మార్కెట్‌ ఎగిసి,. 4వ తేదీన ఓట్ల లెక్కింపు రాగానే కుప్పకూలడం తొలిసారిగా చూశామన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పు అనే సమాచారం ముందుగానే భాజపాకు తెలుసన్న ఆయన దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే అసలు నిజాలు బయటపడతాయన్నారు. అటు రాహుల్‌ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని భాజపా నేత పీయూష్‌ గోయల్‌ మండిపడ్డారు. పెట్టుబడిదారుల్ని.... తప్పుదారి పట్టించేందుకే రాహుల్‌ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాల రోజున కాంగ్రెస్‌కు సీట్లు పెరుగుతుంటే మార్కెట్‌ పడిపోయిందన్న గోయల్‌ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని తెలిసి మళ్లీ మార్కెట్‌ పుంజుకుందన్నారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున స్టాక్‌ మార్కెట్లలో పతనాన్ని అతిపెద్ద కుంభకోణంగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఈ అతిపెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా పాత్ర ఉందని.. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు. జూన్ 2 వ తేదీన నకిలీ ఎగ్జిట్‌ పోల్స్‌ కారణంగా జూన్‌ 3 వ తేదీన స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయని.. అయితే ఎన్నికల ఫలితాల రోజున ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కావడంతో స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ జరిగిందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. దీనివల్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు సుమారు రూ.30 లక్షల కోట్లు కోల్పోయారని చెప్పారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ ముందురోజు స్టాక్ మార్కెట్లలో భారీగా పెట్టుబడులు ఎలా జరిగాయంటూ.. ఆ డేటాను మీడియా సమావేశంలో రాహుల్‌ గాంధీ చూపించారు. ఆ రోజు మార్కెట్లలో పెట్టుబడులు పెట్టింది ఎవరు.. చివరికి భారీగా లాభాలను పొందింది ఎవరు అంటూ ప్రశ్నించారు. ఈ అవకాశాన్ని కొందరు విదేశీ మదుపరులు ఉపయోగించుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోగా.. కొందరు వ్యక్తులు మాత్రం భారీగా లాభపడ్డారని ఆరోపించారు. మోదీ, అమిత్ షాకు ఈ కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. వీరితో పాటు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలు, విదేశీ వ్యక్తుల పాత్రను కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ - జేపీసీతో విచారణ జరిపించాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.

Tags

Next Story