PM Modi: రాహుల్ అర్బన్ నక్సల్! -పీఎం మోడీ

రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. మంగళవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని ప్రసంగించారు. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో ప్రారంభించి, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని ఉపయోగించి కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేసింది. అయితే, కాంగ్రెస్ విమర్శలకు ప్రతిస్పందించిన మోడీ.. ‘‘ బీజేపీ, దాని మిత్రపక్షాలు రాజ్యాంగ స్పూర్తిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా జీవిస్తాయి’’ అని అన్నారు.
‘‘కొందరు బహిరంగంగా అర్బన్ నక్సల్స్ భాషను మాట్లాడుతారు. భారత రాజ్యంపై యుద్ధం ప్రకటించే వారు ఈ దేశ రాజ్యాంగాన్ని లేదా ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోలేరు’’ అని రాహుల్ గాంధీ పేరుని ప్రస్తావించకుండా ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘‘దేశంలో అన్ని వ్యవస్థల్లోకి ఆర్ఎస్ఎస్, బీజేపీ చేరాయని, మేము కేవలం ఈ రెండింటితోనే కాకుండా భారత రాజ్యంపై పోరాడుతున్నాము’’ అని అనడం వివాదాస్పదమైంది. దీనిపైనే ప్రధాని మోడీ ‘‘అర్బన్ నక్సలైట్’’ అని విమర్శించారు.
పేదల గుడిసెల్లోకి వెళ్లి ఫొటోలు తీసుకునే వారికి పార్లమెంట్‌లో పేదల గురించి మాట్లాడితే విసుగ్గానే ఉంటుందంటూ ఆయన రాహుల్‌పై ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని తిరిగేవారికి ముస్లిం మహిళలు కష్టాలు ఎదుర్కోవడానికి తామే కారణమని తెలుసా అని మోదీ ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ చట్టం ద్వారా ముస్లిం మహిళలకు హక్కులు కల్పించామని ప్రధాని ప్రకటించారు.
తాము బూటకపు నినాదాలు ఇవ్వబోమని, ప్రజలకు నిజమైన అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని ఆయన తెలిపారు. ఐదు దశాబ్దాల క్రితం వరకు గరీబీ హఠావో నినాదాలు వినిపించేవని, ఇప్పుడు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారని మోదీ తెలిపారు. 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు లభించాయని ఆయన చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com