PM Modi: జనవరి 22 న ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్య ప్రాణప్రతిష్ఠ..

PM Modi: జనవరి 22 న ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్య ప్రాణప్రతిష్ఠ..
అయోధ్యలో శరవేగంగా పూర్తవుతున్న నిర్మాణ పనులు

హైందవ సమాజం కంటున్న సనాతన కల త్వరలోనే సాకారం కానుంది. కోట్లాది మంది హిందువులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆలయ తుది దశ పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కానుండగా.. జనవరి 22 వ తేదీన అయోధ్య రామమందిరంలో రాముడు కొలువుదీరనున్నాడు. దీనికి సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే తేదీని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి అతిథులను ఆహ్వానించే పనిలో ట్రస్ట్ సభ్యులు తలమునకలై ఉన్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీలోని ఆయన నివాసంలోకి వెళ్లి.. రామాలయ ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కావాలని ట్రస్ట్ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నట్లు తెలుస్తోంది.

దాదాపు 8 అడుగుల ఎత్తైన బంగారు పూత పూసిన పాలరాయి సింహాసనంపై రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని శ్రీ రామ్‌ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ఈ సింహాసనం మూడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు ఉంటుందని పేర్కొంది. 24 మెట్లు ఎక్కితే రామ మందిర ప్రాంగణం, అద్భుతమైన సింహద్వారం, మూడు అంతస్తుల్లో రాఘవుడు కొలువుండే గర్భగుడి… ఎదురుగా వీర భక్త హనుమాన్‌ సన్నిధి . సూర్యోదయం వేళ భానుడి తొలి కిరణాలు రామచంద్రుడికి పాదాలు తాకేలా ఏర్పాటు చేయనున్నారు.


ఇక అయోధ్యపురి కోసం సర్వం సిద్ధమైంది. 2024 జనవరి 22 వ తేదీన అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆలయ ఆవరణలో ఉన్న రామ్‌ లల్లా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ.. కొత్త ఆలయంలోని గర్భగుడిలోకి తీసుకువెళ్లనున్నారని సమాచారం. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొత్తం ప్రధాని మోదీ చేతుల మీదుగానే జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇక 12 రోజుల పాటు సాగే ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారని అంచనా. ఈ మహోత్సవాన్ని కనులారా చూడలేని భక్తజనం కోసం మరో ఏర్పాటు చేసింది శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. స్వామి వారి అక్షింతల్ని దేశంలోని ప్రతీ లోగిలికీ చేర్చే ప్రయత్నం జరుగుతోంది. ఈనెల ఐదున అంటే.. వచ్చే ఆదివారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామ అక్షింతలకు పూజా కార్యక్రమం జరుగుతుంది. ఒక్కో రాష్ట్రం నుంచి ఇద్దరేసి ప్రతినిధుల్ని ఎంపిక చేసి.. వారి ద్వారా అక్షింతల పంపిణీ చేయనున్నారు.


Tags

Next Story