Australia: భారత్‌కు వ్యతిరేకంగా సెనెటర్‌ వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పాలన్న ఆస్ట్రేలియా ప్రధాని

భారతీయులకు అండగా ఉంటామని న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వ హామీ

ఆస్ట్రేలియాలో భారత సంతతి ప్రజలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన సెనెటర్‌పై ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ తీవ్రంగా స్పందించారు. సదరు సెనెటర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, భారత సమాజానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిణామం ఆస్ట్రేలియా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆస్ట్రేలియాలో పెరుగుతున్న జీవన వ్యయానికి, ఇతర సమస్యలకు భారత వలసదారులే కారణమంటూ సెంటర్‌ రైట్‌ లిబరల్ పార్టీకి చెందిన సెనెటర్ జసింటా ప్రిన్స్ ఆరోపించారు. అధికార లేబర్ పార్టీ కేవలం ఓట్ల కోసమే భారతీయులను పెద్ద సంఖ్యలో దేశంలోకి రప్పిస్తోందని ఆమె విమర్శించారు. "లేబర్ పార్టీకి వచ్చిన ఓట్లను, ఆస్ట్రేలియాకు వలస వచ్చిన భారతీయుల సంఖ్యను పోల్చి చూస్తే విషయం అర్థమవుతుంది" అని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియాలోని భారత సంతతి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జసింటా ప్రిన్స్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. మరోవైపు, ఆమె సొంత పార్టీ అయిన లిబరల్ పార్టీ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించడం గమనార్హం.

ఈ వివాదంపై ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ స్పందిస్తూ, "సెనెటర్ చేసిన వ్యాఖ్యలు భారత సమాజాన్ని తీవ్రంగా బాధించాయి. ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆమె సొంత పార్టీ నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు" అని స్పష్టం చేశారు.

అధికారిక లెక్కల ప్రకారం, 2023 నాటికి ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన వారి సంఖ్య 8,45,800కి చేరింది. గత దశాబ్దంతో పోలిస్తే ఇది రెట్టింపు. ఈ నేపథ్యంలో, న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం అక్కడి భారత కమ్యూనిటీ గ్రూపులతో సమావేశమై వారికి పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ పరిణామాలను భారత విదేశాంగ శాఖ నిశితంగా పరిశీలిస్తూ, ఆస్ట్రేలియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది.

Tags

Next Story