Prashant Kishor: పరీక్షల్లో అవకతవకలపై బీహార్‌లో కొనసాగుతున్న ఆందోళనలు..

Prashant Kishor:  పరీక్షల్లో అవకతవకలపై బీహార్‌లో కొనసాగుతున్న ఆందోళనలు..
X
అభ్యర్థులను ప్రశాంత్ కిషోర్ రెచ్చగొట్టడంతో పోలీస్ కేసు నమోదు..

బీహార్‌లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అక్రమాలు జరగడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అభ్యర్థులు ఆందోళన చేస్తుండటంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేత ప్రశాంత్‌ కిషోర్‌, కోచింగ్‌ సెంటర్ల యజమానులతో పాటు మరో 700 మంది నిరసనకారులపై కేసు ఫైల్ చేశారు. కాగా, ఆదివారం వేలాది మంది అభ్యర్థులు పట్నాలోని గాంధీ మైదాన్‌ దగ్గర ఆందోళనలు చేపట్టగా.. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నివాసం వైపు ర్యాలీగా బయల్దేరేందుకు యత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.

అయితే, విద్యార్థుల నిరసనకు జన్ సురాజ్‌ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సపోర్ట్ ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ నిరసనలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు.. ర్యాలీలకు, నిరసనలను అనుమతి లేకున్నా పీకే అభ్యర్థులను రెచ్చగొట్టడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రేరేపించారని పోలీసులు చెప్పుకొచ్చారు. తమ మార్గ దర్శకాలను పాటించకపోవడంతోనే ప్రశాంత్‌ కిషోర్‌పై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు పోలీసులు.

ఇక, డిసెంబర్‌ 13వ తేదీన నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్‌ కాంపిటేటివ్‌ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీకైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో గత 10 రోజులకు పైగా నిరుద్యోగులు నిరసన చేస్తున్నారు. పరీక్షను క్యాన్సిల్ చేసి.. కొత్తగా మళ్లీ నిర్వహించాలని కోరుతున్నారు. అయితే, పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని బీపీఎస్సీ అధికారులు తేల్చి చెప్పారు. పరీక్షలను పారదర్శకంగానే నిర్వహించాం.. అభ్యర్థుల వాదనలకు ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ ఆందోళనల్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు.

Tags

Next Story