Venkaiah Naidu: రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ ఫలిస్తే.. వెంకయ్యనాయుడికే ఎక్కువ అవకాశాలు?

Venkaiah Naidu: 2017 జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ముగుస్తుండడంతో.. రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది ఎలక్షన్ కమిషన్. రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుండి పార్టీల్లో చర్చలు మొదలయ్యాయి. ప్రజల్లో కూడా ఈసారి రాష్ట్రపతి ఎవరు అవుతారో అన్న కుతూహలం ఏర్పడింది. అయితే ఇదే సమయంలో వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అవుతారా అన్న ఆసక్తికర ఆలోచన మొదలయ్యింది.
సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా ఎవరి సెంటిమెంట్ వారికి ఉంటుంది. పలుమార్లు ఆ సెంటిమెంట్ కూడా నిజమవుతూ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రపతి విషయంలో కూడా అలాంటి ఓ సెంటిమెంట్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటివరకు ఉపరాష్ట్రపతులుగా చేసిన 13 మందిలో మొదట ముగ్గురు రాష్ట్రపతి అయ్యారు. తరువాతి ముగ్గురు కాలేదు. మళ్లీ ముగ్గురు రాష్ట్రపతి కాగా.. తరువాతి ముగ్గురు కాలేదు. దీన్ని బట్టి చూస్తే ఉపరాష్ట్రపతిగా చేసిన వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఉన్నట్టే.
కాకపోతే ఈసారి రాష్ట్రపతిగా మహిళలు ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా వచ్చినట్టుంది. అందుకే నిర్మలా సీతారామన్, తమిళిసై సౌందరరాజన్ లాంటి వారి పేర్లు ఈ పోటీకి వినిపిస్తున్నాయి. అంతే కాకుండా బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ను ఆ పదవి నుండి తప్పించి రాష్ట్రపతి చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు వినికిడి. ఇవన్నీ ఊహాగానాలే కానీ ఇప్పటివరకు ఆ పార్టీ మాత్రం ఎవరి పేరును ధృవీకరించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com