Lok Sabha Elections: రెండోవిడతలో 63.5% పోలింగ్

దేశంలో సార్వత్రిక ఎన్నికల రెండోదశలో సుమారు 63.5% మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పూర్తి సమాచారం వచ్చాక ఇది మరికొంత పెరిగే అవకాశం ఉంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. దాదాపు 65.5 శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడత కింద 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాలకు శుక్రవారం నిర్వహించిన పోలింగ్ చాలావరకు ప్రశాంతంగానే ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ బహిష్కరణ వంటివి కొన్నిచోట్ల కనిపించాయి. శతాధిక వృద్ధులు, ఆసుపత్రుల్లోని రోగులు సయితం ఉత్సాహంగా స్పందించి ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా చేశారు. కొంతమంది ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. మధ్యాహ్నం వేడిమి ఎక్కువగా ఉండడంతో అనేకమంది సాయంత్రం చల్లబడ్డాక ఇళ్లనుంచి బయటకు వచ్చారు. 6 గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉన్నా, ఆ సమయంలోపు ఆయా కేంద్రాలకు చేరుకున్నవారంతా ఓటువేసేందుకు అవకాశం ఉండటంతో ఆ తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది.
ఎన్నికలు జరిగిన పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం వల్ల ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కేరళలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న ఒక పోలింగ్ ఏజెంట్, ఓటేసిన ముగ్గురు ఓటర్లు ఎండ వేడి, అనారోగ్య వల్ల మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని మహసముంద్‌లో ఎన్నికల భద్రతా విధుల్లో ఉన్న ఓ జవాన్ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మణిపూర్‌లోని కల్లోలిత ప్రాంతాల్లో భారీ భద్రత మధ్య ఓటింగ్ జరిగింది. పలుచోట్ల మిలిటెంట్లు ఓటర్లను ఓటేయొద్దని బెదిరించారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని ఇండిగనత గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణతో పలు ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. కాగా, బెంగళూరులోని ఓ ప్రైవేటు దవాఖానలో ఉన్న 41 మంది పేషెంట్లు ఓటు వేసేందుకు గ్రీన్ కారిడార్లు ఏర్పాటుచేసి ఆంబులెన్సుల్లో తీసుకెళ్లారు. మతం పేరుతో ఓట్లడుగుతూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన బెంగళూరు దక్షిణ బీజేపీ అభ్యర్థి తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. విద్వేష వ్యాఖ్యలు చేసి, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారనే ఆరోపణలపై కర్ణాటకకు చెందిన సీనియర్ బీజేపీ నేత సీటీ రవిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
లోక్‌సభ ఎన్నికల ఐదో దశ నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం శుక్రవారం జారీ చేసింది. బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్ముకశ్మీర్, లఢక్‌లో ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 49 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. అతి తక్కువ స్థానాల్లో ఓటింగ్ జరగనున్న దశ ఇదే. ఈ విడతలో మే 20న పోలింగ్ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com