Pune car Accident: మైనర్‌కు బెయిల్ మంజూరులో వింతలెన్నో

మద్యం మత్తులో మైనర్ కారు నడిపి ఇద్దరు టెకీల ప్రాణాలు తీశాడు. అనంతరం గంటల వ్యవధిలోనే మైనర్ నిందితుడికి బెయిల్ రావడం.. అలాగే ప్రమాదంపై వ్యాసం రాసుకుని రమ్మని చెప్పడం.. ఇదంతా తీవ్ర దుమారం చెలరేగింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవ్వడంతో నిందితుడికి కోర్టు బెయిల్ రద్దు చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ దర్యాప్తులో మెడికల్ రిపోర్టులు తారుమారు చేయడంతో వారిని సస్పెండ్ చేసింది. అంతేకాకుండా కోర్టు తీరుపై కూడా కమిటీ దర్యాప్తు చేస్తుంది. ఈ సందర్భంగా మైనర్ బెయిల్ విషయంలో లోపాలు ఉన్నట్లుగా తాజాగా గుర్తించింది.
బెయిల్ వ్యవహారంలో అనేక విధానపరమైన లోపాలు, నిబంధనలు పాటించకపోవడం వంటివి కమిటీ గుర్తించినట్లు ఓ అధికారి వెల్లడించారు. ‘‘నిందితుడికి బెయిల్ మంజూరు సమయంలో జేజేబీలో ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్నారు. మరుసటిరోజు మరొకరు తన సమ్మతి తెలియజేశారు. నిబంధనలు పాటించకపోవడం, దుష్ర్పవర్తన వంటివి ఈ ఇద్దరు సభ్యుల విషయంలో కమిటీ గుర్తించింది. లోపాలు స్పష్టంగా ఉన్నందునే జేజేబీ బెంచ్ మరుసటిరోజు బెయిల్‌ను రద్దు చేసినట్లు విచారణలో తేలింది’’ అని అధికారి తెలిపారు.
పుణె కారు యాక్సిడెంట్ కేసులో నిందిత మైనర్ బాలుడిని విడుదల చేయడంలో జువెనైల్ జస్టిస్ బోర్డ్ (జేజేబీ) పరస్పర విరుద్ధంగా వ్యవహరించినట్లు వెల్లడైంది. ఈ మేరకు విచారణ కమిటీ సామాజిక న్యాయ శాఖకు 100 పేజీల నివేదిక సమర్పించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. బాలుడికి జేజేబీ నాన్ జ్యుడిషియల్ సభ్యుడు ఎల్‌ఎన్ దన్వడే బెయిల్ మంజూరు చేశారు. రోడ్డు భద్రతపై 300 పదాలతో వ్యాసం రాయాలని, రూ.15 వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన 15 గంటల్లోనే ఈ తీర్పు చెప్పి నిందితుడిని వదిలిపెట్టారు. రక్త నివేదికలోని లోపాలను దన్వడే పరిశీలించలేదని నివేదిక చెప్పింది. నిబంధనల ప్రకారం రోస్టర్‌ను తయారు చేయకుండా తీర్పు ప్రకటించారని తెలిపింది. జేజేబీ సభ్యులు హాజరు కాకపోయినప్పటికీ, దన్వడే ఒక్కరే విచారణ జరిపి, బాలుడిని విడుదల చేసినట్టు వివరించింది. లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నందున మర్నాడే దన్వడే తీర్పును జేజేబీ ధర్మాసనం రద్దు చేసి ఉండాల్సిందని తెలిపింది. జేజేబీ సభ్యులందరికీ షోకాజ్ నోటీసులను ఇచ్చినట్లు తెలిపింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com