Chandrayaan-3: జాబిల్లిపై సగర్వంగా కాలుమోపిన ప్రజ్ఞాన్ రోవర్

చంద్రుడిపై భారత విజయపతాకాన్ని సగర్వంగా ఎగరేసిన చంద్రయాన్-3లో అసలు పని ప్రారంభమైంది. ల్యాండర్ విక్రమ్ నుంచి విడిపోయి జాబిల్లిపై సగర్వంగా కాలుమోపిన ప్రజ్ఞాన్ రోవర్ ..తన అసమాన ప్రతిభ చూపే సమయం ఆసన్నమైంది.. విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్ చేయాల్సిన పని చాలా ఉంది.. ఆ దిశగా పని మొదలైందని ఇస్రో చెబుతోంది. చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా చరిత్ర సృష్టించిన చంద్రయాన్-3 తదుపరి లక్ష్యాన్ని చేరుకునేందుకు కీలక ప్రక్రియ మొదలుపెట్టింది. చందమామపై ప్రజ్ఞాన్ నడక సాగించిందంటూ ఇస్రో వెల్లడించింది. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ ఉంటాయని ప్రకటించింది.
ల్యాండర్, రోవర్ పనితీరు అద్భుతంగా ఉన్నాయన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్ .. విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ ల్యాండర్ కిందికి దిగింది. అతిత్వరలోనే రెండు ఫొటోలు పంపించే అవకాశం ఉందని తెలిపారు. ఇక చంద్రుడిపై విక్రమ్, ప్రజ్ఞాన్ ఎంతకాలం పనిచేస్తాయన్న విషయంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. భూమ్మీద ఒక పగలు 12 గంటలు. అదే చంద్రుడిపై 14 రోజుల సమయం. అంటే 14 రోజులు పూర్తిగా వెలుగు. ఆ తర్వాత చీకటి ఉంటుంది. సోలార్ ప్యానెళ్ల ద్వారా శక్తిని పొందే విక్రమ్, ప్రజ్ఞాన్ చంద్రుడిపై పడే సూర్యరశ్మితో పనిచేస్తాయి. ఆ తర్వాత చంద్రుడిపై చీకటి నెలకొని ఉష్ణోగ్రత మైనస్ 180 డిగ్రీలకు పడిపోతుంది. ఈ వ్యవధిలో మనుగడ కష్టమే. అయితే మళ్లీ 14 రోజుల తర్వాత చంద్రుడిపై సూర్యోదయం అయ్యాక.. సూర్యరశ్మి పడి విక్రమ్, ప్రజ్ఞాన్ తిరిగి పనిచేయడం మొదలుపెడితే గొప్ప ప్రయోజనమని ఇస్రో చెబుతోంది. అయితే ల్యాండర్ విక్రమ్ యాక్టివేట్ అయితేనే భూమికి సంకేతాలు చేరతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com