Prajwal Revanna: ప్రారంభమైన ప్రజ్వల్ రేవణ్ణ జైలు జీవితం..

Prajwal Revanna:  ప్రారంభమైన ప్రజ్వల్ రేవణ్ణ జైలు జీవితం..
X
అధికారికంగా జీవితఖైదు.. ఖైదీ నెంబర్ 15528

మహిళపై అత్యాచారం చేసిన కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూర్ కోర్టు ‘‘జీవిత ఖైదు’’ శిక్షను విధించింది. తన ఇంట్లో పనిచేసే మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆ చర్యని వీడియో తీసి, పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. దీంతో కోర్టు అతడికి జీవితఖైదు శిక్షను విధించింది. రూ. 524 నెలవారీ వేతనం కోసం 8 గంటల పాటు రోజూవారీ పని చేయాలని ఆదేశించింది.

ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణ జీవిత ఖైదు శిక్ష అధికారికంగా ప్రారంభమైంది. బెంగళూర్‌లోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్షను ప్రారంభించాడు. ఇతడికి 15528 నెంబర్ కేలాయించారు. జైలులోని దోషుల బ్యారక్‌లోకి మార్చారు.

మైసూరులో 47 ఏళ్ల పని మనిషిపై అత్యాచారం చేసినందుకు, శనివారం మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌కు జీవిత ఖైదు, రూ. 11 లక్షల జరిమానా విధించబడింది. ఎఫ్‌ఐఆర్ నుండి తుది తీర్పు వరకు కేవలం 14 నెలల్లో విచారణ పూర్తి చేసి, శిక్ష విధించబడింది. ఆదివారం నుంచి తెల్లని దుస్తులు ధరించి, కఠినమైన జైలు టైమ్ టేబుల్ పాటించాల్సి ఉంటుంది. కర్ణాటక జైలు మాన్యువల్ ప్రకారం, ఇతర ఖైదీలలాగే అతడిని చూస్తామని అధికారులు ధ్రువీకరించారు. జైలులో బేకరీ, తోటపని, పాడి పరిశ్రమ, కూరగాయల పెంపకం, వడ్రంగి, హస్తకళలు వంటి పనుల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

Tags

Next Story