Bihar Elections: అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నిషేధాన్ని ఎత్తేస్తాం: ప్రశాంత్ కిషోర్

బిహార్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మద్య నిషేధాన్ని రద్దు చేస్తామని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. అక్టోబరు 2న తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లను వివరిస్తూ ఈ విషయాన్ని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘జన్ సురాజ్ ప్రభుత్వం ఏర్పడితే అధికారంలోకి వచ్చిన గంటలోపే బిహార్‌లో ఉన్న మద్యపాన నిషేధాన్ని ఎత్తేస్తాం. ఇందు కోసం రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం’’ అని తెలిపారు.
రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు తేజస్వీ యాదవ్ రాష్ట్రంలో చేపట్టిన యాత్రపై మాట్లాడుతూ కనీసం అతడు ఇప్పటికైనా ఇంటి నుంచి బయటకువచ్చి ప్రజల మధ్యకు వెళ్లడం మంచి పరిణామమే అని అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో చేరినందుకు ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ తనకు చేతులు జోడించి క్షమాపణలు చెప్పారని ఇటీవల తేజస్వీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వారిద్దరి వల్ల రాష్ట్రానికి నష్టం తప్ప ప్రయోజనం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. బిహార్ ప్రజలు 30ఏళ్లుగా వారిని భరిస్తున్నారన్నారు. ఇకనైనా వారు బిహార్‌ను విడిచి పెట్టాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.
ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ బిహార్‌లో ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం ఉన్నప్పటికీ అభివృద్ధి సూచీల్లో వెనకబడి ఉందని తేజస్వీ చేసిన వ్యాఖ్యలను దుయ్యబట్టారు. ఆయన రాజకీయ నాయకుడు కావడానికి ఏకైక కారణం మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు కావడమే అని పేర్కొన్నారు.
బిహార్ (Bihar)లో మద్యం వినియోగం, విక్రయాలపై 2016 ఏప్రిల్‌లోనే పూర్తిగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. నాటి నుంచి కొన్ని ప్రాంతాల్లో కల్తీ మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మద్యపాన నిషేధాన్ని ఎత్తేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com