President Murmu: రామ మందిరం కల నెరవేరిందన్న రాష్ట్రపతి

17వ లోక్‌సభ చివరి సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9వ తేదీ వరకూ కొనసాగే ఈ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారిగా ప్రసంగించిన రాష్ట్రపతి.. దేశ అభివృద్ధి, ప్రభుత్వ విజయాలు, నిర్ణయాలు, రంగాల వారిగా సాధించిన వృద్ధి, ప్రగతిని ప్రసంగంలో ప్రస్తావించారు. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైందని పేర్కొన్నారు. జీ20 సమావేశాలను భారత్ విజయవంతంగా నిర్వహించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని తెలిపారు.
ఈ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము .. ఉదయం రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్‌కు సంప్రదాయ గుర్రపు బగ్గీ లో వెళ్లారు. అనంతరం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. గత శుక్రవారం గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ముర్ము.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్‌లో కాకుండా సంప్రదాయ బగ్గీ లో రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్యపథ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి బగ్గీని వినియోగించడం 40 ఏండ్ల తర్వాత అదే తొలిసారి కావడం విశేషం.
ఇక ఈ బండి వెనుక ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది. బ్రిటిష్ పాలనా కాలంలో భారత దేశ వైస్రాయ్ దీనిని ఉపయోగించేవారు. అప్పటి వైస్రాయ్ ఎస్టేట్ (ప్రస్తుత ప్రెసిడెన్షియల్ ఎస్టేట్)లో ఈ బండిలో విహరించేవారు. బ్రిటిష్ పాలన అంతమై, భారత్, పాకిస్థాన్ వేర్వేరు దేశాలుగా ఏర్పాటైనపుడు ఈ విలాసవంతమైన బండి కోసం పోటీ జరిగింది. దీనిని దక్కించుకోవడానికి భారత్, పాక్ ప్రయత్నించాయి. చివరికి ఓ నాణేన్ని ఎగురవేసి, అదృష్టం ఎవరిని వరిస్తే వారిదే ఈ బగ్గీ అనే రాజీ మార్గానికి వచ్చారు. భారత దేశ కర్నల్ ఠాకూర్ గోవింద్ సింగ్, పాకిస్థాన్ కర్నల్ సాహబ్‌జాదా యాకూబ్ ఖాన్ నాణేన్ని ఎగురవేశారు. అదృష్టం భారత్‌ను వరించింది. దీంతో ఈ బండి భారత్‌కు లభించింది.
ఇక తన ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యలో రామాలయ నిర్మాణం గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. కోసం కొన్ని శతాబ్ధాలు ఎదురుచూశామని, రామ్‌లల్లా ఇప్పుడు భవ్య మందిరంలో కొలువుదీరినట్లు ఆమె పేర్కొన్నారు. కోట్లాది దేశ ప్రజల ఆశయం నెరవేరిందన్నారు. ఆ పండుగను దేశ ప్రజలు సంబురంగా జరుపుకున్నట్లు ఆమె చెప్పారు. గత ఏడాది భారత్ ఎన్నో విజయాలను సాధించిందన్నారు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటి స్కీమ్‌లు ఇండియాను మరింత బలోపేతం చేశాయన్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ చాలా వేగంగా ఎదిగిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com